ఏపీ ఎన్నికలపై లగడపాటి ఆసక్తికర వ్యాఖ్యలు

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 12, 2019, 09:57 PM
 

లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏప్రిల్‌ 11న ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదన్నారు. ఏదో ఒక పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. పోలింగ్‌ ముగిసిన తర్వాతే తన సంస్థ సర్వే ఫలితాలను వెల్లడిస్తానని చెప్పారు. ప్రత్యేక హోదా అనేది ఈ ఎన్నికల్లో ఒక అంశం మాత్రమేనని చెప్పారు. వైరుధ్యాలున్న నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకతాటిపైకి తేవడం మంచిపరిణామమన్నారు. ఎల్లప్పుడూ వైషమ్యాలతో ఉండాలని ఎవరూ కోరుకోరని అన్నారు. ఈ ఎన్నికల్లో తాను ఎక్కడా పోటీ చేయబోనని, ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని తాను నిర్ణయించుకున్నట్టు స్పష్టంచేశారు. విభజన తర్వాత రాష్ట్రం అనేక కష్టాలను ఎదుర్కొందని, ఆర్థికలోటులోనూ అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని లగడపాటి వ్యాఖ్యానించారు.