ఎవరొచ్చినా.. ఏం చేసినా నా గెలుపును అడ్డుకోలేరు : కొడాలి నాని

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 12, 2019, 09:54 PM
 

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కొడాలి నానిని ఎలాగైనా ఓడించి తీరాలని టీడీపీ భావిస్తోంది. నానిని ఓడించేందుకు దివంగత దేవినేని నెహ్రూ కుమారుడు, తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ను ఇక్కడి నుంచి బరిలో దింపుతోంది. అయితే అవినాష్ నాన్ లోకల్ కావడంతో కొడాలి నాని దాన్నే అస్త్రంగా మలుచుకుంటున్నారు. స్థానిక నేతలపై నమ్మకం లేకనే టీడీపీ ఎక్కడినుంచో అభ్యర్థిని తీసుకొచ్చి గుడివాడ బరిలో నిలిపిందంటూ విమర్శిస్తున్నారు. మంగళవారం గుడివాడలో జరిగిన వైసీపీ ఆవిర్భావ వేడుకల్లో నాని టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
గుడివాడలో తనను ఓడించేందుకు టీడీపీ చేయని ప్రయత్నం లేదని కొడాలి అన్నారు. డబ్బు, మంది బలంతో తనను ఓడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నాన్ లోకల్ అభ్యర్థిని తీసుకొచ్చి తనపై పోటీ చేయిస్తున్నారని.. ఎవరొచ్చినా, ఏం చేసినా గుడివాడలో తన గెలుపును అడ్డుకోవడం ఎవరి వల్లా కాదని తేల్చి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి తగిన బుద్ది చెబుతారని,రాష్ట్ర ప్రజలు వైసీపీకే పట్టం కడుతారని ధీమా వ్యక్తం చేశారు.