తూర్పులో టీడీపీకి గట్టి షాక్‌

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 12, 2019, 09:13 PM
 

తూర్పుగోదావరిలో అధికార టీడీపీకి గట్టి షాక్‌ తగిలింది. కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఆయన సతీమణి తోట వాణి పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. వారిరువురు బుధవారం వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా తోట వాణి మాట్లాడుతూ... టీడీపీలో తమకు దారుణమైన అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. తన భర్తకు పార్టీలో సముచిత స్థానం ఇవ్వలేదని, ఆయన అనారోగ్య కారణాల దృష్ట్యా తనకు అసెంబ్లీ టికెట్‌ కేటాయించాలని కోరినా చంద్రబాబు నుంచి ఎటువంటి స్పందన రాలేదని వాపోయారు. వైఎస్సార్‌ సీపీలో తమకు సముచిత స్థానం కల్పిస్తామని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారని, అందుకే ఆ పార్టీలో చేరుతున్నామని పేర్కొన్నారు.
మానవత్వం కూడా లేదా? ‘ఈ మధ్య చంద్రబాబు నుంచి కబురు వచ్చింది. నా భర్త అనారోగ్యం వల్ల వెళ్ళలేకపోయాం. ఈ విషయాన్ని మా జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులకు చెప్పాను. అప్పటి నుంచి జిల్లా టీడీపీ నేతలు కనీసం నా భర్తను పలకరించలేదు. వాళ్ళను చూస్తే కనీసం మానవత్వం లేదా అనిపించింది. తోట నరసింహం చిన్న వ్యక్తి కాదు. గత పదిహేనేళ్లుగా రాజకీయాలలోను...ప్రజల్లో ఉన్న వ్యక్తి. ఆయనకు సముచిత స్థానం కల్పించలేదు’ అని ఆవేదన వాణి వ్యక్తం చేశారు. కాగా జగ్గంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని తోట వాణి భావించారు. ఈ టికెట్‌ను వైఎఎస్సార్‌ సీపీ గుర్తుపై గతంలో గెలిచిన జ్యోతుల నెహ్రూకు చంద్రబాబు దాదాపు ఖరారు చేశారు.