టీడీపీలో అలాంటి పరిస్థితి లేదు: చంద్రబాబు

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 12, 2019, 09:02 PM
 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేలం పాటలా టిక్కెట్లు అమ్ముకుంటుంటే.. టీడీపీలో మాత్రం అలాంటి పరిస్థితి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలుగుదేశంలో మాత్రం ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభిష్టం మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని అన్నారు. మంగళవారం పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి రాగద్వేషాలు లేవని స్పష్టం చేశారు. ఎవరికైనా అనుమానాలు ఉంటే రికార్డులు కూడా ఇస్తామని అన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించడానికి వీల్లేదని ఆదేశించారు. పనిచేసినవారితోపాటు, సామాజిక న్యాయాన్ని అభ్యర్థుల ఎంపికలో పాటిస్తున్నామని చెప్పారు. టిక్కెట్ ఇవ్వలేకపోతున్నామని తాను చెబితే.. అర్థం చేసుకున్నాం, పార్టీ కోసం పనిచేస్తామని కొందరు స్ఫూర్తిదాయకంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు అన్నారు. కుటుంబ పెద్దగా అందరికీ న్యాయం చేసే బాధ్యత తనదేనన్న చంద్రబాబు.. అందరినీ గుర్తించి భవిష్యత్తులో పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. కుటుంబంలాంటి పార్టీ కోసం ఇప్పుడు అండగా ఉన్నవారందరి భవిష్యత్తు పార్టీ చూసుకుంటుందని ఆయన అన్నారు. కుట్రలపై జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సూచించారు.