ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయండి.- అనిల్ చంద్ర పునేఠ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 12, 2019, 08:48 PM

 వచ్చేనెల 11న జరగనున్న సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రతి ఓటరు తన ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందకు వీలుగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల చంద్ర పునేఠ జిల్లా కలక్టర్లు,ఎస్పిలను ఆదేశించారు.రానున్న సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై మంగళవారం అమరావతి సచివాలయం నుండి కలక్టర్లు,ఎస్పిలతో ఆయన దృశ్య శ్రవణ(వీడియో) సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని,ఎన్నికల విధుల నిర్వహణలో ప్రతి అధికారి,ఉద్యోగి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.ఎన్నికలు స్వేచ్చగా,శాంతియుతంగా జరిపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామనే నమ్మకాన్ని అటు ఓటర్లలోను,ఇటు రాజకీయ పార్టీలకు కల్పించాలని అన్నారు.ప్రతి పోలింగ్ కేంద్రంలోను తాగునీరు,విద్యుత్ సరఫరా వంటి కనీస సౌకర్యాలు కల్పించడంతోపాటు దివ్యాంగులు ఓటు వేసేందుకు వీలుగా ర్యాంపులు నిర్మించి ఉంచాలని సిఎస్ ఆదేశించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు ఇతర అంశాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుండి జారీ అయిన అన్ని రకాల ఆదేశాలను తుఛ తప్పక పాటించి అవి సక్రమంగా అమలు జరిగేలా అవసమరైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఈవిషయంలో కలక్టర్లు,ఎస్పిలు సమన్వయంతో పనిచేయాలని సిఎస్ ఆదేశించారు.మొదటి విడతలోనే ఎన్నికలు జరగనున్నందున ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో సమీక్షించే వీలుందని సకాలంలో ఏర్పాట్లను పూర్తి చేయాలని కలక్టర్లను ఆదేశించారు.పరిపాలన,సాంకేతిక వంటి అంసాల్లో మన యంత్రాంగం ఎంతో మెరుగైన రీతిలో పనిచేస్తున్నట్టుగానే ఎన్నికల నిర్వహణలో కూడా మెరుగైన రీతిలో పనిచేశారనే పేరు తీసుకు వచ్చేందుకు ప్రతి ఒక్కరూ అంకింత భావంతో పనిచేసి ఎన్నికలను సజావుగా నిర్వహించేలా కృషి చేయాలని సిఎస్ అనిల్ చంద్ర పునేఠ పేర్కొన్నారు.


రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆర్పి ఠాకూర్ మాట్లాడుతూ అంతర్ జిల్లా,రాష్ట్ర చెక్ పోస్టులను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పిలు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.నూరు శాతం ఆయుధాలు పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ అయ్యేలా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎన్నికల్లో ఎక్కడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అవసమరైన బందోబస్తు ఏర్పాట్లను చేయాలని ఎస్పిలను ఆదేశించారు.రాజకీయ పార్టీలు నిర్వహించుకునే ఎన్నికల ప్రచార సభలు,సమావేశాలకు ముందస్తు అనుమతులు జారీలో నిష్పక్షపాతంగా ఉండాలని చెప్పారు.ఎన్నికల్లో డబ్బు,ఇతర వస్తువుల పంపిణీని నియంత్రించి ఎన్నికల ప్రవర్తణా నియమావళి సక్రమంగా అమలు అయ్యేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఈవిషయంలో కలక్టర్లు, ఎస్పిలు సమన్వయంతో పనిచేయాలని డిజిపి ఆదేశించారు.రానున్న సాధారణ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రానికి 90 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలు (సిపిఎంఫ్)రానున్నాయని వాటిని మావోయిస్టు ప్రబావిత,ఇతర అత్యంత సమస్యాత్మక  తదితర ప్రాంతాల్లో వారి సేవలను వినియోగించేందుకు ప్రణాళికను రూపొందించాలని చెప్పారు.


రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన నాటినుండే రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన నేపధ్యంలో అధికారికంగా నిర్వహించే వెబ్ సైట్లలో రాజకీయ ప్రముఖుల పొటోలను వెంటనే తొలగించాలని కార్యదర్శులు,శాఖాధిపతిలు,కలక్టర్లును కోరారు.అలాగే ప్రభుత్వ కార్యాలయాలతో పాటు వివిధ పబ్లిక్ ఆస్తులకు సంబంధించిన భవనాలు,ప్రాంగణాల్లో ఎలాంటి హోర్డింగ్లు,పోస్టరు వంటివి లేకుండా చూడాలని చెప్పారు.ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకునేందుకు ఈనెల 15వతేదీ చివరి గడువని ఆలోగా ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు వారి పేర్లను నమోదు చేసుకునేందుకు ఫారమ్-6 ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చని ఆయన ప్రజలకు సూచించారు. పోలింగ్ ప్రక్రియపై వెబ్ కాస్టింగ్,వీడియోగ్రఫీ నిర్వహణకు సంబంధించిన రేట్లను ఖరారు చేయడం జరుగుతోందని ఆప్రకారం అవసరం మేరకు వాటిని సమకూర్చుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.జనవరి తర్వాత ఓటర్లుగా నమోదుకు ధరఖాస్తు చేసుకున్న వారికై 20లక్షల ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించి జిల్లాలకు పంపండం జరుగుతోందని అవి సక్రమంగా పంపిణీ అయ్యేలా కలక్టర్లు ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పారు.ఎలక్ట్రానికి ఓటింగ్ యంత్రాలు,వివిప్యాట్లకు సంబంధించి సిబ్బంది తగిన శిక్షణను ఇవ్వాలన్నారు.ప్రవర్తనా నియమావళి అమలుకు సంబంధించి రోజువారీ నివేదికలను సమర్పించాలని కలక్టర్లను సిఇఓ ద్వివేది ఆదేశించారు.పోలింగ్ కేంద్రాలు,కౌంటింగ్ కేంద్రాలు, ఆర్ఓ,ఎఆర్ఓల నియమావకం, మెజిస్టీరియల్ అధికారాలు వంటి అంశాలల్లో త్వరగా ప్రతిపాదనలు పంపాలని కోరారు.ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియా,వెబ్ సైట్లలో వచ్చే ప్రకటనలు తదితర కార్యక్రమాలను కంట్రోల్ రూమ్ ల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు.



 


 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com