ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగుల మెడికల్ రీఇంబర్సుమెంట్ గడువు జూన్ 30 వరకూ పొడిగింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 20, 2019, 06:51 PM

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న మెడికల్ రీఇంబర్సుమెంట్ సౌకర్యాన్ని మరో ఆరు మాసాల వరకు అనగా వచ్చే జూన్ 30 వరకూ పొడిగిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ వెల్లడించారు. బుధవారం అమరావతి సచివాలయంలో సిఎస్ అధ్యక్షతన జరిగిన ఉద్యోగుల ఆరోగ్య పధకం(ఇహెచ్ఎస్) పై డా.ఎన్టిఆర్ వైద్య సేవ ట్రస్టు స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ రీఇంబర్సుమెంట్ గడువు గత డిశంబరు 31తో ముగియగా మరో ఆరు మాసాల పాటు అనగా జూన్ 30 వరకూ ఈగడువును పెంచేందుకు చర్యలు తీసుకున్నామని వెంటనే ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పారు.మెడికల్ రీఇంబర్సుమెంట్ బిల్లులు జిల్లాల నుండి లేదా సంబంధిత శాఖాధిపతుల నుండి అందిన నెల రోజుల్లోగా వాటిని క్లియర్ చేయాలని ఎన్టిఆర్ వైద్య సేవా ట్రస్టు తదితర అధికారులను ఆయన ఆదేశించారు.అదేవిధంగా ఉద్యోగుల ఆరోగ్య కార్డులకు సంబంధించి కొత్తగా చేర్చిన శాఖల,విభాగాలకు చెందిన ఉద్యోగుల డేటాను మార్చి 15వతేదీ లోగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.కొత్తగా ఈపధకంలో చేర్చిన ఆంధ్రప్రదేశ్ వైద్యవిద్యా పరిషత్,గురుకులాలు,వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన నాన్ టీచింగ్ ఉద్యోగులు,స్థానిక సంస్థలు,గ్రంధాలయాలు,పాఠశాలల ఉపాధ్యాయులు ఉన్నారని వారి వివరాలను మార్చి 15లోగా అందివ్వాలని ఆదేశించారు.ఉద్యోగుల ఆరోగ్య కార్డులపై వైద్య సేవలు పొందే విషయంలో ఎదురవుతున్న వివిధ సమస్యలను చర్చించి సకాలంలో పరిష్కరించేందుకు వీలుగా ముఖ్య కార్యదర్శి,ఎన్టిఆర్ వైద్య సేవ సిఇఓ,ఉద్యోగ సంఘాల నేతలతో కూడిన ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతోందని సిఎస్ అనిల్ చంద్ర పునేఠ చెప్పారు.
ఉద్యోగుల ఆరోగ్య పధకం సక్రమంగా అమలు చేయగలిగితే మెడికల్ రీఇంబర్సుమెంట్ సౌకర్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉండదని కావున ఈపధకాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను సిఎస్ పునేఠ ఆదేశించారు.ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అనేక రకాల సౌకర్యాలను కల్పిస్తున్న నేపధ్యంలో ఉద్యోగులు కూడా బాధ్యతా యుతంగా పనిచేసి మెరుగైన రీతిలో సమాజానికి సేవలందించాలన్న భావన ప్రతి ఉద్యోగిలోను కలగాలని ఆయన సూచించారు.
వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య కార్డులపై అందించిన వైద్య సేవలకు సకాలంలో బిల్లులు రావడం లేదని వివిధ నెట్ వర్కు ఆసుపత్రులు చెబుతున్నాయని కావున సకాలమలో నిధులు విడుదల చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఆమె సిఎస్ దృష్టికి తెచ్చారు.ఇందుకు సంబంధించి ఉద్యోగుల నుండి సేకరించిన కంట్రిబ్యూషన్ నిధులు 50శాతం,ప్రభుత్వం నుండి ఇచ్చే 50శాతం నిధులను ఎన్టిఆర్ ట్రస్ట్ వద్ద ప్రత్యేక ఖాతాలో ఉంచితే సకాలంలో విడుదల చేసేందుకు వీలుంటుందని చెప్పారు.విద్యాశాఖ ఉద్యోగులకు సంబంధించి కాలిపోయిన 190 మెడికల్ రీఇంబర్సుమంట్ బిల్లులు చెల్లింపనకై ప్రత్యేకంగా ప్రభుత్వ జీఓ విడుదల చేయనున్నట్టు చెప్పారు.హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఎఆర్ అనురాధ మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న హోం గార్డులకు కూడా ఆరోగ్య కార్డులు జారీ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదించారని ఆప్రతిపాదనలు ఆర్ధికశాఖ వద్ద ఉన్నాయని వారికి కూడా ఆరోగ్య కార్డులు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎన్టిఆర్ వైద్య సేవ సిఇఓ సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకూ వివిధ ప్రభుత్వ ఉద్యోగులు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు,ఫించన్ దారులు తదితరులు కలిపి 16లక్షల 77వేల912 మంది ఆరోగ్య కార్డులకు నమోదు కాగా ఇప్పటి వరకూ 15లక్షల 38వేల 128ఆరోగ్య కార్డులను జారీ చేయడం జరిగిందన్నారు.రాష్ట్రంలో 943 నెట్ వర్కు ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయని ఉద్యోగులకు ఆరోగ్య కార్డులపై అందుతున్న సేవల్లో 98శాతం ఈనెట్ వర్కు ఆసుపత్రుల నుండే అందుతున్నాయని వివరించారు.2018-19 ఏడాదికి గాను ఉద్యోగుల ఆరోగ్య సేవలకు 187.40కోట్ల రూ.లు నిధులు విడుదల కాగా ఇప్పటికే 186కోట్ల రూ.లు బిల్లులు చెల్లించడం జరిగిందని తెలిపారు. మరో 50కోట్ల రూ.లు చెల్లించేందుకు ఎన్టిఆర్ వైద్య సేవ ట్రస్టు సిద్ధంగా ఉందని చెప్పారు.
ఈస్టీరింగ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్య కార్డులపై వైద్యం చేసిన ఆసుపత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించక పోవడంతో వైద్యం జరిగిన వెంటనే డబ్బులు వస్తున్నాయని మెడికల్ రీఇంబర్సుమెంట్ కే ఆయా నెట్ వర్కు ఆసుపత్రులు ప్రాధాన్యతను ఇస్తున్నాయని అన్నారు.మెడికల్ రీఇంబర్సుమెంట్ లో కొన్ని ప్యాకేజిలు సరిగా లేక ఉద్యోగులు నష్టపోతున్నారని,వివిధ ఆసుపత్రుల్లో ఆర్యోగ్య కార్డులకు సంబంధించి ఒపి ఉండడం లేదని అన్నారు.ఉద్యోగుల ఆరోగ్య పధకానికి ఉద్యోగులు ఇచ్చే కంట్రిబ్యూషన్ మరియు ప్రభుత్వం ఇచ్చే గ్రాంటును ఎన్టిఆర్ వైద్య సేవ ట్రస్టు వద్ద ప్రత్యేక ఖాతాలో ఉంచితే సకాలంలో బిల్లుల్లు చెల్లించేందుకు వీలై తద్వారా ఈపధకాన్ని మెరుగైన రీతిలో అమలు చేసేందుకు అవకాశం కలుగుతుందని ఆదిశగా చర్యలు తీసుకోవాలన విజ్ణప్తి చేశారు.
ఎపి ఎన్జిఓ సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ హెల్తుకార్డులున్న వారిందరకీ సక్రమంగా వైద్య సేవలు అందేలా చూడాలని కోరారు.హెల్తు కార్డులపై వైద్య సేవలకు 2లక్షల రూ.లు వరకూ మాత్రమే అన్న పరిమితిని తొలగించాలని విజ్ణప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న జబ్బుల జాబితాలో మరిన్ని రోగాల జాబితాను చేర్చాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు.ఎస్టియు రాష్ట్ర అధ్యక్షులు సుధీర్ బాబు మాట్లాడుతూ ఆరోగ్య కార్డులపై వైద్యం చేయించుకునే రోగులకు వివిధ ఆసుపత్రుల్లో కంబైన్డ్ రూమ్ ఇస్తున్నారని అలా కాకుండా ప్రత్యేక రూమ్ కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ణప్తి చేశారు.రాష్ట్ర ప్రభుత్వ ఫించన్ దారుల సంఘం అధ్యక్షులు కె.సోమేశ్వర రావు మాట్లాడుతూ ఆరోగ్య కార్డుల వల్ల ఫించన్ దార్లు సంతోషంగా ఉన్నారని తెలిపారు.జిల్లా ట్రెజరీల నుండి ఫించన్ దారుల జాబితా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com