ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామస్థాయి నుంచి ప్రణాళికలు -నాబార్డ్ స్టేట్ క్రెడిట్ సెమినార్ లో సీఎస్ అనీల్ చంద్ర పునీఠ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 19, 2019, 07:48 PM

వ్యవసాయ రంగ అభివృద్ధికి, గ్రామీణ ఉపాధి అవకాశాల మెరుగు కోసం గ్రామీణ స్థాయి నుంచి బ్యాంకర్లు  ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనీల్ చంద్ర పునీఠ సూచన చేశారు. సచివాలయం 5వ బ్లాక్ లో నబార్డ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం జరిగిన ఆంధ్రప్రదేశ్ 2019-20 స్టేట్ క్రెడిట్ సెమినార్ లో ఆయన ప్రసంగించారు. ప్రణాళికలు గ్రామ, మండల దిగువ స్థాయి నుంచి సెక్టార్ల ప్రకారం తయారు చేస్తే ఫలితాలు ఉంటాయన్నారు. విజన్ డాక్యుమెంట్ రూపొందించుకోవాలన్నారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనేక పథకాలు ప్రవేశపెట్టి, వాటిని అమలు చేయడంలో దేశంలో ముందుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, ఇతర జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి రాష్ట్రానికి 650 అవార్డులు వచ్చినట్లు తెలిపారు. ప్రగతి సాధించడంలో ఏపీని మంచి ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతుల కృషి ఫలితంగా సమ్మిళిత అభివృద్ధి సాధించినట్లు సీఎస్ తెలిపారు. అంతకు ముందు నాబార్డ్ ఏపీ ప్రాంతీయ ఛీఫ్ జనరల్ మేనేజర్ కె.సురేష్ కుమార్ మాట్లాడుతూ 2019-20 ఆర్థిక సంవత్సరానికి నాబార్డ్ రూ.1,87,061 కోట్ల రుణ ప్రణాళికతో స్టేట్ ఫోకస్ పేపర్ రూపొందించినట్లు తెలిపారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు అత్యధికంగా రూ.1,23,526 కోట్లు, ఎంఎస్ఎంఈకి రూ.32,906 కోట్లు కేటాయించినట్లు వివరించారు. గత మూడున్నర దశాబ్దాలుగా నాబార్డ్ వ్యవసాయ రుణ ప్రళానికకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి ప్రణాళికలతో స్థానిక వనరుల ఉపయోగానికి, నైపుణ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రాధమిక రంగం, అర్బన్ డెవలప్ మెంట్ వంటి ఏడు మిషన్లను దృష్టిలో పెట్టుకొని సమ్మిళిత అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మంచి బ్యాంకింగ్ నెట్ వర్క్ ఉందన్నారు.  ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబ రావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో రాష్ట్రం అద్వితీయమైన అభివృద్ధి సాధిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటు సాధిస్తున్నట్లు తెలిపారు.  గృహ నిర్మాణానికి రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు సహకరించాలని కోరారు.  
వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం-జడ్ బీఎన్ఎఫ్(జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్)కు సంబంధించి ఆంధ్రప్రదేశ్  త్వరలో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పారు. ప్రస్తుతం 5 లక్షల మంది రైతులు 5 లక్షల ఎకరాల్లో  ఈ సాగు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి అంతర్జాతీయ సంస్థలు సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. మన దేశంలో ఈ సాగుని పరిశీలించడానికి అనేక దేశాల వారు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. 2022 నాటికి 60 లక్షల ఎకరాల్లో సాగు చేయాలన్నది లక్ష్యంగా పేర్కొన్నారు. బ్యాంకులు కౌలుదారులకు రుణాలు అందించాలన్నారు. అన్నదాత ఎవరు? వాస్తవ వ్యవసాయదారులు ఎవరు? అనేది గుర్తించవలసిన అవసరం ఉందన్నారు. నిజమైన వ్యవసాయదారునికి ఫలితాలు చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో వ్యవసాయ కుటుంబానికి రూ.15 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకం ప్రకటించిన 24 గంటల లోపల అమలులోకి వచ్చిందన్నారు. మొదటగా రైతుల ఖాతాలలో రూ.1000లు జమ చేసినట్లు చెప్పారు. ఈ విధంగా మొత్తం రూ.498 కోట్లు జమ చేసినట్లు రాజశేఖర్ తెలిపారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ డైరెక్టర్ సుబ్రతా దాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటుతో శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. వ్యవసాయ రంగంలో మౌలిక వసతులకు నాబార్డ్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో ఇచ్చే రుణాలు, ఆర్థిక సహాయానికి ఫోకస్ పేపర్ ప్రాధమికమైనదని చెప్పారు. హార్టీ కల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి,  ఫిషరీస్ శాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ కెఎస్డీ శివ వరప్రసాద్, నాబార్డ్ జీఎం కె.ఎస్.రఘుపతి, ఏజీఎం పీ.రామలక్ష్మి తదితరులు ప్రసంగించారు. ఈ సెమినార్ లో  వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com