వైకాపా కు డబ్బు సంచులే కొలమానం

  Written by : Suryaa Desk Updated: Sun, Feb 17, 2019, 01:59 AM
 

జగన్ హైదరాబాద్‌లో విలాసంగా కూర్చుని, అక్కడే కేసీఆర్ సహకారంతో అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. శ‌నివారం ఉద‌యం ఉండ‌వ‌ల్లిలోని త‌మ నివాసం నుండి తెదేపా నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ ఏపీలో నివసించడమే ఇష్టంలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. వైకాపా టికెట్లకు ప్రజాసేవ కొలమానం కాదు.. డబ్బు సంచులే అని కొల‌మాన‌మ‌ని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. జగన్ ఒకసారి పోటీ చేసిన వారికి మరోసారి అంత తేలిగ్గా అవకాశమివ్వరని, డబ్బులు ఎవరిస్తే వారికే టికెట్లు ఇచ్చే వ్యక్తి అని విమర్శించారు. జగన్‌కు ఎన్నికల అంటే వ్యాపారమంటూ మండిప‌డ్డారు. వైకాపాలో అంతా ఒక్కసారి మాత్రమే ఆడే ఆటగాళ్లని (వన్‌టైం ప్లేయర్స్‌) ఎద్దేవా చేశారు. ఏపీలో అభివృద్ధిని ప్రధాని మోదీ జీర్ణించుకోలేరని, ఏపీని చూస్తుంటే కేసీఆర్‌కు కూడా కంటగింపుగా ఉందని సీఎం చంద్ర‌బాబు విమర్శించారు.