తెప్పపై శ్రీ ఆండాళ్ స‌మేత శ్రీ‌కృష్ణ‌స్వామివారి అభ‌యం

  Written by : Suryaa Desk Updated: Sun, Feb 17, 2019, 01:32 AM
 
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శ‌నివారం సాయంత్రం శ్రీ ఆండాళ్ స‌మేత శ్రీ‌కృష్ణ‌స్వామివారు తెప్ప‌ల‌పై భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం సాయంత్రం 7.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై 5 చుట్లు విహరించి భక్తులకు అభయమిచ్చారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. అదేవిధంగా ఆదివారం శ్రీదేవి భూదేవి స‌మేత శ్రీ గోవింద‌రాజ‌స్వామివారు తెప్పలపై 5 చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించనున్నారు.    ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో  ఉదయభాస్కర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీహరి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌  కృష్ణమూర్తి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.