ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షర్మిల, విజయమ్మకు షాకిచ్చిన వైఎస్ జగన్..ఎన్సీఎల్టీలో పిటిషన్, ఆ కంపెనీ షేర్ల కోసం!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 10:16 PM

వైఎస్సార్ కుటుంబంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. వైఎస్ జగన్ వర్సెస్ షర్మిల, విజయమ్మల మధ్య ఆస్తుల వార్ మొదలైంది. సోదరి షర్మిల, తల్లి విజయమ్మపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సతీమణి వైఎస్ భారతి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేశారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్ల వివాదంపై సెప్టెంబర్‌ 10న జగన్, భారతిలు NCLTలో పిటిషన్‌‌ను ఆశ్రయించారు.వైఎస్ జగన్ తరఫున వై సూర్యనారాయణ కంపెనీల యాక్ట్ 59 కింద ఈ పిటిషన్‌ను దాఖలు చేయగా.. విచారణకు స్వీకరించి.. తదుపరి విచారణను నవంబర్ 8వ తేదీకి వాయిదా వేశారు. ఎన్‌సీఎల్‌టీ ఈ పిటిషన్‌కు సంబంధించి ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.


ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, చాగరి జనార్దన్ రెడ్డి, కేతిరెడ్డి యశ్వంత్ రెడ్డి, రీజినల్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్, రిజిస్ట్రారర్ ఆఫ్ కంపెనీస్ తెలంగాణలను ప్రతివాదులుగా చేర్చారు. తాము కంపెనీ అభివృద్ధి కోసం కృషి చేశామని.. 2019 ఆగస్ట్ 21న ఎంవోయూ ప్రకారం విజయమ్మ, షర్మిలకు షేర్ల కేటాయించామని.. కానీ వివిధ కారణాలతో కేటాయింపు జరగలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ కంపెనీకి సంబంధించిన షేర్లను విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని పిటిషన్‌లో ప్రస్తావించారు.


తన సోదరిపై అప్యాయతతో షర్మిలకు మొదట్లో వాటాలు కేటాయించాలని భావించామన్నారు జగన్. అయితే ఇటీవల రాజకీయంగా ఆమె తనకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ ఆఫర్‌ను విరమించుకున్నట్లు పిటిషన్‌లో ప్రస్తావించారు. రాజకీయపరంగా ఉన్న విభేదాలు ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చాయి. ఈ కంపెనీలో తనకు 51 శాతం వాటాలు ఉన్నాయని.. తన సోదరి, తల్లి షేర్ల బదిలీని రద్దు చేయాలని ఎన్‌సీఎల్‌టీని జగన్ అభ్యర్థించారు. వారిద్దరికి వాటాలు ఇవ్వదలుచుకోలేదని ప్రస్తావించారు. వైఎస్ జగన్, భారతిలు NCLTలో దాఖలు చేసిన ఈ పిటిషన్ చర్చనీయాంశంగా మారింది.


గత నెల (సెప్టెంబర్) 3వ తేదీన కేసు నెంబర్ CP- 48/2024.. సెప్టెంబర్ 11వ తేదీన IA (కంపెనీస్ యాక్ట్)-268/2024, IA (కంపెనీస్ యాక్ట్)-266/2024, IA (కంపెనీస్ యాక్ట్)-267/2024 కేసు నెంబర్లతో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ 18న IA (కంపెనీస్ యాక్ట్)-319/2024 కేసు నెంబర్‌తో పిటిషన్ దాఖలైంది. వైఎస్ షర్మిల మొదటి నుంచి సోదరుడు జగన్‌కు అండగా నిలిచారు.. 2014 ఎన్నికలకు ముందు అన్న జైల్లో ఉన్న సమయంలో పాదయాత్ర చేశారు. అలాగే 2014 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.. 2019 ఎన్నికల్లో ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు.. వైఎస్సార్‌సీపీ ఏపీలో అధికారంలోకి రావడంతో షర్మిలకు జగన్ ప్రాధాన్యం ఇస్తారనే చర్చ జరిగింది. కానీ షర్మిలకు ఎలాంటి పదవి దక్కలేదు.. పార్టీలో కూాడా ప్రాధాన్యం ఇవ్వలేదు.


ఆ తర్వాత నుంచి జగన్‌కు దూరంగా జరిగారు షర్మిల.. సడన్‌గా తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి వైఎస్సార్‌‌ తెలంగాణ పేరుతో పార్టీని స్థాపించి పాదయాత్ర చేశారు.. కానీ 2023 తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయలేదు.. కాంగ్రెస్ పార్టీకి మద్దదతు ప్రకటించారు. ఆ తర్వాత మారి రాజకీయ పరిణామాలతో ఆ పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించి.. సోదరుడ్ని టార్గెట్ చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేకా కుమార్తె సునీతా రెడ్డికి అండగా నిలిచారు.. షర్మిల ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి ఓడిపోయారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com