ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ వరదలకు కారణాలేంటి..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 04, 2024, 08:47 PM

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మం నగరాలు తీవ్రంగా వరద ముంపునకు గురయ్యాయి. ఇప్పటికీ విజయవాడ నగరం వరద ముంపు నుంచి బయటకు రాలేదు. 24 గంటల వ్యవధిలో అసాధారణ రీతిలో వర్షపాతం నమోదు కావడం.. అప్పటికే కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులు నిండుకుండలా ఉండటంతో, ఉప్పొంగిన బుడమేరు వరద బయటకు వెళ్లే దారి లేక విజయవాడ నగరం వరద నీటిలో చిక్కుకుపోయింది.


విజయవాడ నగరం ఈ స్థాయిలో వరద ముంపు బారిన పడటానికి బుడమేరు విషయంలో ప్రభుత్వాలు సరైన రీతిలో వ్యవహరించకపోవడం, స్థానికులు బుడమేరును ఆక్రమించడం ప్రధాన కారణాలని చెబుతున్నారు. తమిళనాడు జియోగ్రఫీ అనే ట్విటర్ (ఎక్స్‌) హ్యాండిల్.. విజయవాడ వరదలకు కారణాలను లోతుగా విశ్లేషించింది. ఆ వివరాలు మీకోసం..


‘‘విజయవాడ డ్రైనేజీ బేసిన్ అనేది కృష్ణా పరివాహక ప్రాంతంతోపాటు కొల్లూరు సరస్సు‌లోకి ప్రవహించే బుడమేరు బేసిన్‌‌లో భాగంగా ఉంది. విజయవాడ నగరంతోపాటు కొండలు, చెరువులతో కూడిన దాదాపు 900 చదరపు కిలోమీటర్ల ప్రాంతం బుడమేరు బేసిన్‌ పరిధిలోకి వస్తుంది.


విజయవాడ నగరానికి వరదలు కొత్తేం కాదు. కృష్ణా నది, బుడమేరు కారణంగా గత వందేళ్లలో 17సార్లకు పైగా విజయవాడకు వరదలొచ్చాయి. 2005లో బుడమేరు కారణంగా విజయవాడ ఉత్తర ప్రాంతంలో భారీగా వరదలొచ్చాయి. దీంతో విజయవాడ నగరం మధ్య నుంచి వెళ్లే బుడమేరు ప్రవాహాన్ని మళ్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.


బుడమేరు నీరు విజయవాడ ప్రధాన నగరంలోకి రాకుండా చూసేందుకు.. పోలవరం కాలువ (పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి చేర్చే కాలువ)లోకి బుడమేరును మళ్లించింది. 37 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోలవరం కాలువలోకి బుడమేరును మళ్లించడం వల్ల విజయవాడ వాసులకు బుడమేరు బెడద తప్పుతుందని ప్రభుత్వం భావించింది.


బుడమేరును పోలవరం కాలువతో అనుసంధానించే ప్రాంతంలో.. బుడమేరు విజయవాడలోకి వెళ్లడాన్ని నియంత్రించేందుకు వీలుగా 11 గేట్లతో ఓ బ్యారేజీని ఏర్పాటు చేసింది. ఫలితంగా బుడమేరు నీరు పోలవరం కాలువ ద్వారా కృష్ణా నదిలో కలిసేది. దీంతో విజయవాడకు బుడమేరు వరదల బెడద తగ్గింది. ఇక్కడ గమనించాల్సి విషయం ఏంటంటే.. బుడమేరును పోలవరం కాలువలోకి మళ్లించినప్పటికీ.. కృష్ణా నది 19 మీటర్ల స్థాయి దాటి ప్రవహిస్తే.. పోలవరం కాలువ నీళ్లు నదిలోకి వెళ్లకపోగా.. కృష్ణా నది వరదే పోలవరం కాలువలోకి రివర్స్‌లో వస్తుంది.


బుడమేరును పోలవరం కాలువతో అనుసంధానించిన తర్వాత.. బుడమేరు రెండు భాగాలైంది. ఒకటేమో పోలవరం కాలువ వరకు కలిసే ప్రాంతం. మరొకటి దాని దిగువ భాగం. పోలవరం కాలువ దిగువ ప్రాంతంలో ప్రవాహం లేకపోవడంతో.. బుడమేరు నామమాత్రంగా మారింది. దీంతో స్థానికులు రివర్ బెడ్‌ను ఆక్రమించిన నిర్మాణాలు చేపట్టారు. ఫలితంగా విజయవాడలో బుడమేరు రివర్ బెడ్ 15 మీటర్ల కంటే తక్కువ వెడల్పుకు కుచించుకుపోయింది. దీంతో వరద నీటిని భరించే సామర్థ్యం బుడమేరుకు లేకపోయింది.


విజయవాడ వరదలు


బుడమేరు ఎగువ ప్రాంతంలో, క్యాచ్‌మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురవడం వల్ల సెప్టెంబర్ 1న వరదలొచ్చాయి. ఈ వర్షాల కారణంగా బుడమేరుకు 50 వేల క్యూసెక్కులకుపైగా వరద వచ్చింది. ఇది పోలవరం కాలువ సామర్థ్యం కంటే ఎక్కువ. మరోవైపు కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. పోలవరం కాలువలోని నీళ్లు నదిలోకి వెళ్లే అవకాశం లేకపోయింది.


బుడమేరు ఉప్పొంగడం, స్థానికంగా ఉన్న వరద వచ్చి చేరడంతో పోలవరం కాలువ పొంగిపొర్లింది. దీంతో అప్రమత్తమైన ఇంజినీర్లు బుడమేరు బ్యారేజీ11 గేట్లను తెరిచి నీటిని దిగువకు వదిలారు. చాలా ఏళ్ల తర్వాత బుడమేరు బ్యారేజీ గేట్లను తెరవగా.. దిగువ భాగంలో ఏరు కుచించుకుపోవడంతో భారీ వరద వెళ్లేందుకు దారి లేకపోయింది (ఆ మాటకొస్తే.. అంతకు ముందు కూడా బుడమేరు కెపాసిటీ 15 వేల క్యూసెక్కులే). దీంతో విజయవాడను వరద మంచెత్తింది.


బుడమేరుకు వరదలొచ్చిన చరిత్ర ఉన్నప్పటికీ, ఇది విజయవాడ వాసులను ఇబ్బంది పెడుతున్నప్పటికీ.. ఏపీ ప్రభుత్వాలు దాని రివర్ బెడ్‌ నిర్వహణపై శ్రద్ధపెట్టలేదు. పోలవరం కాలువ బుడమేరు వరదను అడ్డుకుంటుందనే తప్పుడు ఆశ కల్పించారు. విజయవాడ వరదలు ప్రకృతి విపత్తేనా అంటే అవును. కానీ రివర్ బెడ్‌తోపాటు, కట్టల నిర్వహణ సరిగా నిర్వహించి ఉంటే.. వరదల బారిన పడిన ప్రజల సంఖ్య తక్కువగా ఉండేది. ఇక్కడ సమస్య బుడమేరు మళ్లింపు అనేది సమస్య కాదు. కొంత మేర వరద నీటిని మళ్లించేందుకు అది ఉపయోగపడుతుంది. కానీ బుడమేరును సరిగా మెయింటెయిన్ చేయలేకపోవడమే ప్రధాన సమస్య. సరిగా మెయింటెయిన్ చేసి ఉండుంటే వరదను తగ్గించలేకపోయినా.. దాని ప్రభావాన్ని తగ్గించగలిగే వాళ్లం.


వీటీపీఎస్ వద్ద కలిసే పోలవరం కాలువతో కలిసే ఓల్డ్ బుడమేరు డైవర్షన్ ఛానెల్ (బీడీసీ) సామర్థ్యం 10 వేల క్యూసెక్కులు. అయితే బుడమేరు డైవర్షన్ ఛానెల్ నిర్వహణను చాలా ప్రాంతాల్లో సరిగా పట్టించుకోలేదు. వీటీపీఎస్ దగ్గర బీడీసీ గేట్ల నిర్వహణలోనూ పారదర్శకత కొరవడింది.’’






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com