ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితులకు సాయంపై కీలక ప్రకటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తున్నామని.. ప్రతి ఇంటికి సహాయం అందించాలని సూచించారు. రాష్ట్రంలో వరద వల్ల నష్టాన్ని వివరించి కేంద్ర సాయం కోరతామని చెప్పారు. ఈ వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి మృతదేహాలను వారి కుటుంబాల వారికి అప్పగించాలని.. ఒకవేళ ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరపునే అంత్యక్రియలు నిర్వహించాలని సూచించారు. వరదలు, వర్షాలతో చనిపోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం తరఫున అందిస్తుందన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో.. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కేజీలు ఉల్లిపాయలు, 2 కేజీలు బంగాళదంప, కేజీ చక్కెర అందించాలని అధికారుల్ని ఆదేశించారు. మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి బ్లాక్ మార్కెటింగ్ లేకుండా అతి తక్కువ ధరకు కూరగాయలు విక్రయించేలా చర్యలు చేపట్టాలన్నారు. వరద బాధితులకు ఆహారం, నీరు, బిస్కెట్స్, పాలు, అరటిపండ్లు అన్నీ డోర్ టు డోర్ అందాలని.. అన్ని అంబులెన్స్ లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయాలని.. శానిటేషన్ పనులు వేగవంతం చేయాలన్నారు.. ప్రతి ఇంటిని శుభ్రం చేసే సమయంలో ఇంటికి సంబంధించిన వారిని భాగస్వామ్యులను చేయాలని సూచించారు. .
వరద ప్రభావిత ప్రాంతాల్లో వైరల్ ఫీవర్లు, దోమల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి అలర్ట్ చేయాలన్నారు. ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని.. ఎవరికి ఏం మెడిసిన్ కావాలన్నా అందించాలి అన్నారు. పంట నష్టంపై అంచనాలు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం 50 ఫైర్ ఇంజన్లు అందుబాటులో ఉన్నాయని.. వాటితో వరద ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే పారిశుద్ధ్య పనులు మొదలు పెడతామంటున్నారు అధికారులు. అంతేకాదు ఈ వరదలో మునిగిపోయిన బైకులు, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు పాడయ్యాయని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ వాహనాలకు బీమా చెల్లింపుపై ప్రభుత్వం తరఫున బుధ, గురువారాల్లో బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్యశిబిరాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వరద బాధితులకు పండ్లు, నీరు, ఆహారాన్ని విసిరేయకుండా.. గౌరవప్రదంగా చేతికి అందించాలని సూచనలు చేశారు. మరోవైపు వరద సహాయ చర్యల్లో భాగంగా ప్రాణాలు కోల్పోయిన లైన్‌మెన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని.. విద్యుత్తుశాఖ తరపున రూ.20లక్షలు, ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్‌ఫండ్‌కు సాయం చేసేందుకు డిజిటల్ పేమెంట్, క్యూఆర్ కోడ్ విధానం కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. విరాళాలు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి.