ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులపై విపత్తుల నిర్వహణ సంస్థ బులిటెన్ విడుదల చేసింది. గురువారానికి పశ్చిమ మధ్య,ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఇవాళ శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది అంటున్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.
ఏపీతో పాటుగా తెలంగాణకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల వాతావరణం కనిపిస్తోంది.. గురువారం దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరోసారి భారీ నుంచి అతిభారీ వానలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో భారీ వర్షాలు పడతాయి అంటున్నారు. తెలంగాణ విషయానికి వస్తే.. తూర్పు, ఉత్తర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలకు అవకాశం ఉందంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
మరోవైపు ఏపీలోని పలు జిల్లాల్లో వానలు కొనసాగుతున్నాయి. విజయవాడలో ఉదయం నుంచి కురిసిన మోస్తరు వర్షంతో వరద బాధితుల సహాయక చర్యలకు ఆటంకం ఎదురైంది. విజయవాడతో పాటుగా గుంటూరు, బాపట్ల, గోదావరి జిల్లాల్లో ఉదయం నుంచి వాన పడుతోంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమతో పాటుగా తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. బాపట్ల జిల్లాలోని కృష్ణా నదీ తీరంలో మళ్లీ వాన ఊపందుకోవడంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. వరద తగ్గుముఖం పడుతున్న సమయంలో మళ్లీ వర్షాలు టెన్షన్ పెట్టిస్తున్నాయి.
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి క్రమంగా వరద తగ్గుతోందని చెబుతున్నారు అధికారులు.. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. ఇటు గోదావరికి స్వల్పంగా పెరుగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తెలంగాణలోని భద్రాచలం దగ్గర 42.2 అడుగుల నీటి మట్టం ఉందని.. ధవళేశ్వరం దగ్గర ప్రస్తుత ఇన్ ఫ్లో 3,05,043, ఔట్ ఫ్లో3,12,057 లక్షల క్యూసెక్కులు ఉందన్నారు. గోదావరి ప్రభావం ఉండే ఆరు జిల్లాల అధికార యంత్రంగాన్ని విపత్తుల సంస్థ అప్రమత్తం చేసింది. గోదావరి పరివాహక ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొత్తం మీద ఓ వైపు వరదలు, మరోవైపు వర్షాలతో ఏపీ ప్రజలు ఆందోళనలో ఉన్నారు.