ఏపీని వరదలు వణికించాయి. ముఖ్యంగా విజయవాడ వాసులను బుడమేరు బెంబేలెత్తించింది. బుడమేరు సృష్టించిన బీభత్సానికి ఇప్పటికీ చాలా ప్రాంతాలు వరదనీటిలోనే చిక్కుకుని ఉన్నాయి. పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. పక్షులు, పశువులు అనేకం చనిపోయాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఇళ్లల్లోకి వరదనీరు ప్రవేశించి వందల మంది సర్వస్వం కోల్పోయారు. లక్షల మందిపై వరదలు ప్రభావం చూపించాయి. అయితే ఇంతటి విపత్తు సమయంలో ఆదుకోవాల్సిన చేతులే.. చేతివాటం ప్రదర్శిస్తున్న ఘటన చోటుచేసుకుంది. వరదల కారణంగా సర్వస్వం కోల్పోయి, నీటిలో చిక్కుకుపోయి.. తిండీ, నీరు లేక ఇబ్బందులు పడుతున్నవారిని ప్రభుత్వం పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. అయితే అలాంటి పునరావాస కేంద్రంలో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. పునరావాస కేంద్రంలోని వరద బాధితులకు అందాల్సిన నిత్యావసర సరుకులను స్వాహా చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అవనిగడ్డ పునరావాస కేంద్రాల్లో రెవెన్యూ ఉద్యోగుల చేతివాటం ప్రదర్శించారంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి పునరావాస కేంద్రాల్లోని వరద బాధితులకు అందాల్సిన నిత్యావసర సరుకులను ఎత్తుకెళ్లినట్లు వీడియో వైరల్ అవుతోంది. పునరావాస కేంద్రాల్లోని వరద బాధితులకు పంపిణీ చేసేందుకు నిత్యావసర సరుకులను ఏర్పాటు చేశారు. అయితే అర్ధరాత్రి సమయంలో కొంత మంది స్కూటీలు, బైక్‌ల మీద వచ్చి వీటిని తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అవనిగడ్డలో జరిగిందంటూ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజనం రెవెన్యూ ఉద్యోగుల తీరుపై మండిపడుతున్నారు. సర్వం కోల్పోయిన వారికి అండగా ఉండాల్సిన ఉద్యోగులు.. ఇలా దోచుకెళ్లడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం పోటెత్తింది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం విశ్వనాథపల్లి, పిట్టలంక పాలెంలో చెరువులు పొంగిపొర్లాయి. పలు చోట్ల కాలనీలు, బస్తీలు నీట మునిగాయి. ఈ క్రమంలోనే నీట మునిగిన ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు విజయవాడలోనూ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలే చోటుచేసుకుంటున్నాయి. నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే బోట్లలో తరలించేందుకు కూడా ప్రైవేట్ బోట్లు భారీగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వారికి సీఎం చంద్రబాబు ఇప్పటికే వార్నింగ్ కూడా ఇచ్చారు.