బంగాళాఖాతంలో అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. నిన్న(మంగళవారం) కాస్త గ్యాప్ ఇచ్చిన వర్షం.. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీగా పడుతోంది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలోనూ ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూర్మనాథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువ ప్రాంతం భద్రాచలం వద్ద 42.2అడుగుల నీటిమట్టం కొనసాగుతోందని, ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో 3,05,043లక్షలు కాగా.. ఔట్ ఫ్లో 3,12,057లక్షల క్యూసెక్కులు ఉందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూర్మనాథ్ హెచ్చరించారు.