సూళ్లూరుపేటలో గత ఏడాది అక్టోబరు వరకు ఎస్‌ఐగా పనిచేసి ప్రస్తుతం వీఆర్‌లో ఉన్న రవిబాబుపై సస్పెన్షన్ వేటు పడింది. సూళ్లూరుపేట నుంచి రవిబాబు ఓజిలికి బదిలీ అయ్యాక వీఆర్‌కు పంపారు. అయితే సూళ్లూరుపేట ఎస్‌ఐగా ఉన్నప్పుడు జరిగిన అవకతవకలపై ఇప్పుడు చర్యలు తీసుకున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు మారణాయుధాలతో దాడి చేశారు. టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలవడంతో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆ తరువాత వైసీపీ నాయకులు కల్పించుకోవడంతో కేసు నీరుగారిపోయింది.చివరకు ప్రత్యక్ష సాక్షులను సైతం తారుమారు చేసి కేసును తప్పుదోవ పట్టించారు.ఘటన జరిగిన ప్రదేశంలో దాడికి ఉపయోగించిన వస్తువులను సైతం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపకుండా దర్యాప్తును నిర్లక్ష్యం చేశారు.దీనిపై అప్పట్లో పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించిన ఆరోపణలపై ఎస్పీ సుబ్బరాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించి అంతర్గత విచారణ జరిపారు. ఇందులో అప్పట్లో ఎస్‌ఐగా పనిచేసిన పి.రవిబాబు నిర్లక్ష్యం బయటపడడంతో పాటు నిందితుల పేర్లను అనధికారికంగా తొలగించారని విచారణలో నిర్ధారణ కావడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలు జారీ చేశారు.