వరుణుడి ప్రతాపం, వరదల ధాటికి రెండు తెలుగు రాష్ట్రాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఇటు విజయవాడ, అటు ఖమ్మం సహా చాలా ప్రాంతాల్లో వరద బీభత్సం సృష్టించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వరద సృష్టించిన విలయానికి మరెంతో మంది తినేందుకు తిండి, తాగేందుకు నీళ్లు లేక అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు రంగాలకు అతీతంగా ప్రముఖులు ముందుకు వస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటుగా మరెంతో మంది వీఐపీలు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ వరద బాధితులకు విరాళం ప్రకటించారు. ఇటు ఏపీ, అటు తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాలకు సహాయం చేయడానికి తన వంతు విరాళం అందించారు.
వరద బాధితులను ఆదుకునేందుకు గానూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు పది లక్షలు చొప్పున మొత్తం 20 లక్షలు విరాళం ప్రకటించారు జస్టి్స్ ఎన్.వి. రమణ. విరాళానికి సంబంధించిన చెక్కులను ఢిల్లీలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల రెసిడెంట్ కమీషనర్లకు జస్టిస్ రమణ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ చేతనైనా సాయం చేయాలని పిలుపునిచ్చారు. బాధితులకు అండగా నిలవాలని.. దీని కోసం అందరూ ముందుకు రావాలని కోరారు. ఇదే సమయంలో కేంద్రం కూడా తెలుగు రాష్ట్రాల పట్ల ఉదారంగా వ్యవహరించాలని కోరారు. మరోవైపు వరద బాధితుల కోసం ఇప్పటికే సినీ రంగానికి చెందిన ప్రముఖులు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ , జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ సహా పలువురు నటులు విరాళాలు ప్రకటించారు.
మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఏపీలో 20 మంది చనిపోయినట్లు ప్రభుత్వం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లాలో 12 మంది చనిపోయారని.. గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు చొప్పున మరణించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల 44 వేల మంది నష్టపోయినట్లు పేర్కొంది. అలాగే సుమారుగా లక్షా 70 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. 18 వేలకు పైగా ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 34 వేల మంది రైతులు నష్టపోతే.. 60 వేల కోళ్లు, 222 పశువులు చనిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. 3,312 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతినగా.. 78 చెరువులు, కాలువలకు గండిపడినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.