ఇవాళ(బుధవారం) తెల్లవారుజూము నుంచి ఎన్టీఆర్, గుంటూరు, తూ.గో. జిల్లాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మైలవరం నియోజకవర్గంలోని వరద బాధిత ప్రాంతాలైన విజయవాడ రూరల్, జక్కంపూడి పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. వరద ప్రభావం లేని ప్రాంతాల ప్రజలు, కూటమి కార్యకర్తలు, నాయకులు బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఈ మేరకు వరద ప్రభావం లేని ప్రాంతాల నుంచి మంచినీటి ట్యాంకర్లు పంపాలని ఎమ్మెల్యే కోరారు. మైలవరం పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వాటర్ ట్యాంకర్లలో మంచినీటిని ఎల్బీఆర్సీ కళాశాలలో నింపుతారని, అనంతరం వాటిని తీసుకెళ్లి బాధితుల దాహం తీర్చాలని ఎమ్మెల్యే ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నాయకులు ఎవరూ రావద్దని స్థానిక సహాయక కార్యక్రమాల్లోనే వారు పాల్గొనాలని ఎమ్మెల్యే సూచించారు. జక్కంపూడి ప్రాంతంలో వరదలు ముంచెత్తి నాలుగు రోజులుగా తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంచినీరు, పాలు వంటి పదార్థాలు బాధితులకు అందించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం భోజనం అందిస్తోందని, కూటమి నేతలు ఎవరూ భోజనం సరఫరా చేయెుద్దని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలు అందని ప్రాంతాలను గుర్తించి చెప్పాలని, ఈ మేరకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తెలిపారు.