రెడీ టు ఓట్ ఆనే 11 ఆంగ్ల అక్షరాల నమూనాను వేలాది మంది శ్రీకాకుళం విద్యార్థులు ఆవిష్కరించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులు ప్రదర్శించిన ఈ విన్యాసం ఆకట్టుకుంది. అనేక రికార్డు పుస్తకాల్లోనూ నమోదైంది. 11 ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, జూనియర్ కళాశాలలకు చెందిన 8,323 మంది విద్యార్థులు రెడీ టు ఓట్ (READY TO VOTE ) ఆంగ్ల అక్షరాల నమూనాను ఆవిష్కరించారు. శ్రీకాకుళం కలెక్టర్ కె.ధనంజయరెడ్డి, జాయింట్ కలెక్టర్ కెవిఎన్ చక్రధరబాబు వినూత్న ఆలోచనతో చేపట్టిన కార్యక్రమంలో ఓటరు ప్రతిజ్ఞ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాలాపన కూడా చేశారు. రెడీ టు ఓట్, ప్రతిజ్ఞ, ఎన్నికల చిహ్నం రూపంలో 150 మంది వికలాంగులు ట్రై సైకిళ్లపై కూర్చోవడం ఒక రికార్డు కాగా...8,323 మంది విద్యార్థులు ఒకేసారి మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాలాపన చేయడం రికార్డుగా నమోదైంది. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సౌత్ ఇండియా కో-ఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణశ్రీ, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ కో-ఆర్డినేటర్ బి.నరేంద్రగౌడ్ పరిశీలకులుగా హాజరై రికార్డును ధ్రువీకరించారు. ఈ రెండు సంస్థలతోపాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుకూ ప్రతిపాదన పంపించడంతో, రికార్డు నమోదుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలియజేసింది. కాగా, 2017 జనవరి 25న జాతీయ సమైక్యత, సమగ్రత భావాలతో అశోకచక్ర నమూనాను 5,571 మంది విద్యార్థులతో 4.56 నిమిషాల్లో ఆవిష్కరించడంతో సిక్కోలు చరిత్ర సృష్టించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించారు.
![]() |
![]() |