మార్కెట్లో టమాటా రేట్లు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కిలో టమాటా రేటు వంద రూపాయల వరకూ చేరుకుంది. చాలా చోట్ల కేజీ 80 రూపాయల వరకూ పలుకుతోంది. పదిరోజుల కిందటి వరకూ కిలో రూ.30 వరకూ పలికిన టమాటా.. ఇప్పుడు కొండెక్కి కూర్చుంది. దీంతో సగటు మధ్య తరగతి జీవి ఇబ్బందులు పడుతున్నాడు. టమాటాతో పాటుగా ఇతర కూరగాయల ధరలు కూడా పెరిగిపోవటంతో.. కూరగాయల సంచీ నిండని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం టమాటా రేట్ల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు చర్యలు ప్రారంభించింది. టమాటాలను సబ్సిడీ రేట్లకు రైతు బజార్లలో విక్రయించాలని ఏపీ మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది.
టమాటా ధరలపై ఏపీ మార్కెటింగ్ శాఖ అధికారులు మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పెరుగుతున్న టమాటా ధరలకు కళ్లెం వేయటంపై చర్చించారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో టమాటా 55 నుంచి 65 రూపాయల దాకా పలుకుతోంది. ఇక రైతు బజార్లలో అయితే ఈ ధర రూ.55 వరకూ ఉంది. మరోవైపు మదనపల్లిలోని మార్కె్ట్లోనూ కిలో టమాటా రేటు ప్రస్తుతం రూ.80కి చేరింది. పక్కనున్న రాష్ట్రాల్లో టమాటాను పండించకపోవటంతో పాటుగా.. వర్షాల కారణంగా టమాటాకు డిమాండ్ ఏర్పడినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే టమాటా రేట్లు పెరుగుతున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో పెరుగుతున్న టమాటా రేట్ల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఏపీ మార్కెటింగ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు మార్కెట్ల నుంచి టమాటాను కొనుగోలు చేసి రైతు బజార్లలో ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా టమాటాలను కొనుగోలు చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులు నిర్ణయించారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాలలోని మార్కెట్ల ద్వారా 30 టన్నుల టమాటాలను కొనుగోలు చేసి కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలోలని రైతు బజార్లలో విక్రయించనున్నారు. ఇందుకోసం జిల్లా అధికారులకు రూ.5 లక్షలతో రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికి ఏపీ మార్కెటింగ్ శాఖ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. అయితే ఎంత మేరకు సబ్సిడీ ఉంటుందనేదీ క్లారిటీ లేదు. రైతుబజార్లలో మార్కెటింగ్ శాఖ విక్రయించే టమాటా రేట్లు ఎంతమేర ఉండొచ్చనేదీ మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.
![]() |
![]() |