ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రిగా నియమితులైన నాదెండ్ల మనోహర్ అప్పుడే యాక్షన్‌లోకి దిగారు. స్టాక్ పాయింట్ల తనిఖీలతో బిజీబిజీగా గడుపుతున్నారు. తాజాగా రేషన్ సరుకుల్లో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. సరఫరాలో అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. పౌరసరఫరాలశాఖ మంత్రిగా నియమితులైన తర్వాత క్షేత్రస్థాయిలో స్టాక్ పాయింట్లను పరిశీలించిన మంత్రి.. అనేక అవకతవకలు ఉన్నట్లు గుర్తించారు. తూకాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించి సరఫరాదారులను హెచ్చరించారు.
ఇటీవల తాను జరిపిన తనిఖీల్లో 24 చోట్ల అక్రమాలు జరిగినట్లు తేలిందని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో విలేకర్ల సమావేశం నిర్వహించిన నాదెండ్ల మనోహర్.. క్షేత్రస్థాయి పర్యటనలో తనకు ఎదురైన అనుభవాలను వివరించారు. పౌరసరఫరాల శాఖకు సంబంధించివ స్టాక్ పాయింట్లను పరిశీలించానని. అందులో పంచదార, కందిపప్పు, పామాయిల్ ప్యాకెట్లలో 50-80 గ్రాముల వరకు తేడా ఉన్నట్లు మంత్రి తెలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 253 మండల లెవెల్ స్టాక్ పాయింట్లను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
మరోవైపు ఇప్పటి వరకూ 62 మండలస్థాయి స్టాక్ పాయింట్లలో శాంపిల్స్ పరిశీలిస్తే.. 24 చోట్ల అవకతవకలు జరిగినట్లు తేలిందని మంత్రి చెప్పారు. బాధ్యుల మీద కేసులు నమోదుచేస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గురువారం నాటికల్లా 253 స్టాక్ పాయింట్లను పరిశీలించి.. నివేదిక సమర్పించాలని, జాయింట్ కలెక్టర్లు, తహశీల్దార్లను మంత్రి ఆదేశించారు. అవకతవకలు జరిగిన చోట్ల సరుకులు సరఫరా చేసిన వారిపైనా చర్యలు తీసుకుంటామని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రైతులకు, వినియోగదారులకు ఎటువంటి అన్యాయం జరగకుండా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.
![]() |
![]() |