మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’లో వినతులు వెల్లువెత్తుతున్నాయి. తానున్నానంటూ మంగళగిరి ప్రజలకు యువనేత భరోసా ఇచ్చారు. దీంతో నియోజకవర్గం నలుమూలల నుంచి వివిధ వర్గాల ప్రజలు ఉండవల్లిలోని నివాసానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. ఉదయం 7 గంటల ప్రాంతానికే వందలాదిమంది ప్రజలు వినతి పత్రాలతో నారా లోకేష్ ఇంటివద్ద బారులు తీరుతున్నారు. అంగన్ వాడీలు, ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత దృష్టికి తీసుకువచ్చారు. జీతాలు పెంచాలని అంగన్వాడీ టీచర్లు, బదిలీల కోసం ఉపాధ్యాయులు, ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగుల నుంచి వినతులు అందాయి. విద్య, వైద్య ఖర్చులకు సాయం అందించాలని పలువురు కోరారు. వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ భూములను బలవంతంగా లాక్కున్నారని, తమకు న్యాయం చేయాలని నారా లోకేష్‌కు ఫిర్యాదులు అందాయి.