వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా

  Written by : Suryaa Desk Updated: Mon, Jan 21, 2019, 09:21 AM
 

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ రాజీనామాతో ఆయన మద్దతుదారులు కూడా వైసీపీని వీడుతున్నారు. ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. రాధాకృష్ణకు మద్దతుగా ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేసి లేఖలను వైసీపీ కార్యాలయానికి పంపారు. విజయవాడ కార్పొరేషన్‌లోని 24వ డివిజన్ కార్పొరేటర్ చందన సురేశ్, 17వ డివిజన్ కార్పొరేటర్ చోడిశెట్టి సుజాత, 15వ డివిజన్ కార్పొరేటర్ దామోదర్, 16వ డివిజన్‌ కార్పొరేటర్‌ మద్దాల శివశంకర్‌, 18వ డివిజన్‌ కార్పొరేటర్ పాల ఝాన్సీలక్ష్మిలు వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసిన అనంతరం వారు మాట్లాడుతూ తామంతా రాధా వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తమ పూర్తి మద్దతు, సహకారం ఉంటాయన్నారు. కాగా, రాధాతోపాటు ఆయన అనుచరులు, మద్దతుదారులు కూడా పార్టీని వీడుతుండడం కృష్ణా జిల్లాలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బేనని చెబుతున్నారు.