రాజభోగాలు అనుభవిస్తున్న శశికళ

  Written by : Suryaa Desk Updated: Mon, Jan 21, 2019, 09:14 AM
 

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ బెంగళూరులోని జైల్లో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జైలు అధికారులు ఆమెకు రాజభోగాలను అందిస్తున్న విషయం వెలుగుచూసింది. సామాజికవేత్త ఎన్.మూర్తి సమాచారం హక్కు చట్టం కింద వేసిన దరఖాస్తు ద్వారా పలు విషయాలు వెల్లడయ్యాయి.ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ, శశికళ విషయంలో జైలు అధికారులు తప్పుడు ప్రచారం చేశారని ఆయన విమర్శించారు. ఆమెకు వీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్నారనే విషయం ఇప్పుడు బహిర్గతమైందని చెప్పారు. మొదట్లో ఆమెకు ఒక గది మాత్రమే కేటాయించారని.. ఆమె పక్కనున్న నాలుగు గదుల్లో 2017 ఫిబ్రవరి 14 వరకు మహిళా ఖైదీలు ఉన్నారని తెలిపారు. ఆ తర్వాత వారందరినీ వేరే గదులకు తరలించి, ఐదు గదులను శశికళకే కేటాయించారని చెప్పారు. ఆమెకు వంట చేయడానికి ప్రత్యేకంగా ఒక ఖైదీని అధికారులు కేటాయించారని తెలిపారు. ఆమెను చూడటానికి భారీ సంఖ్యలో ప్రజలను అనుమతిస్తున్నారని... వారంతా నేరుగా ఆమె గదికే వెళ్లి, 3 నుంచి 4 గంటల సేపు గడుపుతున్నారని చెప్పారు. శశికళకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారంటూ జైళ్ల శాఖ డీఐజీ రూప 2017 జూలైలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వసతుల కోసం జైలు అధికారులకు శశికళ రూ. 2 కోట్ల లంచం ఇచ్చారని ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపాయి.