అంతర్జాతీయ బెలూన్ ఫెస్టివల్ చివరి రోజు .....

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 20, 2019, 07:52 PM
 

స్థానిక ఎన్టీఆర్ మైదానంలో వీక్షకులతో కిటకిటలాడింది. ఉదయం 7 గంటలకే పర్యాటకులు స్థానికులు ఎన్టీఆర్ మైదానంలో చేరుకొని ఆకాశంలో ఎగిరే అందమైన దృశ్యాలను చూడటానికి నిరీక్షించారు. ఎనిమిది గంటలకు ఒక్కసారిగా 15 అతిపెద్ద హాట్ ఎయిర్ బెలూన్లు ఆకాశంలో ఎగిరాయి. ఆ దృశ్యాలను చూసి పర్యాటకులు ఆనందంలో మునిగితేలారు. ఒక్కో బెలూన్‌లో సామర్థ్యాన్ని బట్టి 5 నుంచి 8 మంది వరకు గాల్లో ప్రయాణించారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ బెలూన్‌ ఫెస్టివల్‌కు ప్రభుత్వం 4 కోట్ల రుపాయలను వెచ్చించింది. ఈ ఫెస్టివెల్‌లో దాదాపు 26 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు బెలూన్ గ్లైడర్స్ తమ బ్రాండింగ్‌ను ప్రదర్శించారు. ఈసారి కార్న్ ఫ్లా, జోకర్, ఎగ్, స్ట్రాబెర్రీ, నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితోపాటు సాధారణ బెలూన్లు సందడి చేస్తున్నాయి. గంటకు 3000 హార్స్‌ పవర్‌ కలిగిన గ్యాస్‌ను వెలిగిస్తూ గాల్లోకి తీసుకెళ్లారు. ఒక్కో బెలూన్‌లో ఒక్కో పైలట్, మరో కో–పైలెట్‌ ఉండి సందర్శకులకు సలహాలిస్తూ బెలూన్లను రన్ చేశారు. అయితే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోని వాళ్లను ఎగరడానికి అవకాశం కల్పించలేదు. పర్యాటక కేంద్రమైన ఆంధ్ర ఊటీ అందాల అరకులోయలో జరుగుతున్న అంతర్జాతీయ బెలూన్ ఫెస్టివల్ చివరి రోజు (జనవరి 20) ఉత్సాహభరితంగా జరిగింది. పర్యాటకులను ఆకర్షించేందుకు ఏపీ టూరిజం శాఖ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆదివారంతో ముగియనున్న గాలి బుడగ పండగను తిలకించడానికి స్థానికులు, పర్యాటకులు, అధిక సంఖ్యలో తరలివచ్చారు. లక్కీగా ఆదివారం ఉదయం అరకు లోయలో పొగమంచు లేకపోవడంతో ఉదయం 8 గంటల నుండి హాట్ బెలూన్లను గాల్లోకి ఎగరవేశారు.