ఎన్నికలకు ముందు చంద్రబాబు కొత్త ప్లాన్..

  Written by : Suryaa Desk Updated: Sun, Jan 20, 2019, 07:46 PM
 

కేసీఆర్, జగన్ రైతు అజెండాను చంద్రబాబు కూడా ఫాలో కావాలనుకుంటున్నారా? కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధును, జగన్ నవరత్నాల్లో ప్రకటించిన రైతు పథకాలను అనుసరిస్తూనే ఓ సరికొత్త పెన్షన్ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారా? ఇది అమలైతే కౌలు, సన్నకారు, చిన్నకారు రైతులకు కూడా నెలకు కనీసం వెయ్యి రూపాయల పెన్షన్ అందనుందా? ఇలాంటి ప్రశ్నలకు దాదాపు సమాధానం దొరికే సమయం వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సాధించేందుకు అవసరమైన అస్త్రాలను ఒక్కొక్కటిగా సిద్ధం చేసుకుంటున్న చంద్రబాబు సర్కారు.. ఈ దిశగా కేసీఆర్ ప్రభుత్వం విజయానికి కారణమైన రైతుబంధు పథకాన్ని ఏపీలోనూ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.రైతు బంధు తరహా పథకాన్ని ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ తన నవరత్నాల్లో పొందుపరిచారు. రైతులకు పంట పెట్టుబడి కింద ఏడాదికి రూ.12,000 ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో టీడీపీ సర్కారులో ఆందోళన మొదలైంది. జగన్ ప్రకటించిన రైతు నేస్తం పథకాలు వర్కవుట్ అయితే అన్నదాతలు గంపగుత్తగా వైసీపీకి జై కొట్టడం ఖాయమన్న ఇంటిలిజెన్స్ నివేదికల నేపథ్యంలో చంద్రబాబు సర్కారు అప్రమత్తమైంది.కేసీఆర్, జగన్ తరహాలో ఏక మొత్తంగా కాకుండా నెలకు కొంత మొత్తాన్ని పెన్షన్ తరహాలో నేరుగా రైతుల ఖాతాలకు జమ చేయాలని చంద్రబాబు సర్కారు భావిస్తోంది. నెలకు కనీసం వెయ్యి రూపాయల చొప్పున రైతులకు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్, జగన్ తరహాలో రూ.10వేల నుంచి రూ.12,000 మొత్తాన్ని ఒకేసారి రైతులకు ఇవ్వాల్సి వస్తే అది ఖజానాకు భారంగా మారుతుందని భావిస్తున్న సర్కారు.. ఈఎంఐలు, పెన్షన్‌ల తరహాలో నెలవారీగా ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం.


ప్రస్తుతం ఏపీలో అన్నివర్గాల రైతులు కలిపి దాదాపు 60 లక్షల నుంచి 70 లక్షల మంది వరకూ ఉన్నారు. వీరికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున పెన్షన్ లేదా సాయం రూపంలో ఇస్తే ప్రభుత్వంపై ఏటా 8 వేల కోట్ల మేర భారం పడనుంది. రెండు వేల రూపాయల చొప్పున ఇస్తే కనీసం రూ.15 వేల కోట్ల భారం తప్పదు.ప్రస్తుతం ఆసరా పింఛన్లను వెయ్యి నుంచి రెండు వేల రూపాయలకు పెంచినందున అంతకంటే తక్కువగా రైతులకు వెయ్యి రూపాయలు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ లెక్కన నెలకు రూ.2 వేల చొప్పున ఇవ్వాలనుకుంటే ఏటా రూ.15 వేల కోట్లు ఖర్చుపెట్టక తప్పదు. రైతే రాజు పేరుతో అమలు చేసే ఈ సరికొత్త పథకంపై సోమవారం జరిగే కేబినెట్ భేటీలో చర్చించి, వచ్చే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో దీన్ని ఆమోదించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.