ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దివ్యాంగులకు చేయూత నివ్వాలి: ఉపరాష్ట్రపతి

national |  Suryaa Desk  | Published : Sat, Jan 19, 2019, 09:58 PM

 దివ్యాంగులకు చేయూత అందకపోతే అభివృద్ధికి అర్థం లేదని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. మాదాపూర్ శిల్పకళావేదికలో దివ్యాంగుల సహాయార్థం ఏర్పాటు చేసిన సుధాచంద్రన్ నృత్య ప్రదర్శనను ఆయన తిలకించి, ప్రసంగించారు. నృత్యం పట్ల సుధాచంద్రన్ ఆసక్తి, అనురక్తి ఒక కాలు కోల్పోయినా, ఆమెను నాట్య మయూరిని చేయాయని, జీవితంలో సంకల్పబలం ఉంటే సుధాచంద్రన్ లా ఎవరైనా సమస్యలను అధిగమించవచ్చని తెలిపారు. జైపూర్ ఫూట్ కు రోల్ మోడల్ అయిన సుధాచంద్రన్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
1975లో మెహతా గారు స్థాపించిన మహావీర్ వికలాంగ సహాయ సమితి ఎందరికో కృత్రమ కాళ్ళను అమర్చిందని, 40 ఏళ్ళలో ఇప్పటి వరకూ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని 26 దేశాల్లో సేవలు అందించిందని, 1.55 మిలియన్ల మందికి కృత్రిమ కాలు ద్వారా కొత్త జీవితాన్ని అందించిందని తెలిపారు. పేదలను దృష్టిలో పెట్టుకుని అనేక సంస్థలతో కలిసి పరిశోధనలు నిర్వహించి, మరింత సౌకర్యవంతంగా, చవకగా ఈ పాదం రూపొందించే ప్రయత్నాలు చేస్తూ ఎంత మందికి ఉచితంగా అమరుస్తున్న వారి సేవలను అభినందించారు.
దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయని, ఇంకా చేయవలసింది చాలా ఉందన్న ఉపరాష్ట్రపతి, దివ్యాంగుల పట్ల వివక్ష తొలగించి, సమానత్వాన్ని తీసుకురావలసిన అవసరం ఉందని, ఇధి సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని తెలిపారు. దివ్యాంగులు గౌరవ ప్రదమైన జీవితాన్ని గడిపేందుకు వారికి ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు అవకాశాలను కల్పించాలని, వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపి, సమాజంలో అందరిలా బతకాలనే ఆశతో ముందుకు సాగేలా చూడాలని సూచించారు. సృష్టికి ప్రతి సృష్టి చేసేంతంగా సమాజం అభివృద్ధి చెందిందని, ఈ నేపథ్యంలో దివ్యాంగులకు చేయూత అందని నాడు అభివృద్ధికే అర్థం లేదని అభిప్రాయపడ్డారు.
2022 నాటికి 25 లక్షల మంది దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, దేశ జీడీపీ మొత్తం విలువలో దివ్యాంగుల పని, ఉత్పాదకత స్థాయి 5 నుంచి 7 శాతం ఉందని నివేదికలు చెబుతున్నాయని, ఈ నేపథ్యంలో దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు ప్రైవేటు సంస్థలు కూడా ముందుకు రావాలని, వారిలో ఉత్సాహాన్ని నింపి, ఉత్పాదకత వైపు మళ్ళించాలని పిలుపునిచ్చారు. భారత నాట్యంలో సుధాచంద్రన్, ఎవరెస్ట్ ఎక్కిన అరుణిమ సిన్హా, క్రీడాకారిణి మాలతి కృష్ణమూర్తి లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని, అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. సమాజంలో మార్పు వస్తోందని, ఈ నేపథ్యంలో అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా గౌరవప్రదమైన జీవితాన్ని గడిపి నలుగురికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.


 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com