ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఇంటర్వ్యూలు వాయిదా వేయండి.. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే: యూపీఎస్సీకి చైర్మన్‌కు చంద్రబాబు లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 25, 2024, 09:32 PM

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యూపీఎస్సీ ఛైర్మన్‌కు లేఖ రాశారు. రాష్ట్ర కేడర్ అధికారులను ఐఏఎస్‌లుగా ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ప్రతిపాదనలు పంపడం నిబంధనలకు విరుద్ధమని లేఖలో ప్రస్తావించారు. జూన్ 4న తేదీన ఎన్నికల ఫలితాలు ఉన్నందు వల్ల పదోన్నతులు చేపట్టడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొండితనంతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లే అవుతుందని.. ఈ పదోన్నతుల జాబితాలో ఉన్నవారు కూడా కేవలం సీఎంవోలో ఉన్నవారే అన్నారు. జాబితా కూడా నిబంధనల ప్రకారం రూపొందించలేదని ఆరోపించారు.


సరైన విధానాలు అనుసరించకుండా పదోన్నతలు కట్టబెట్టేందుకు జాబితాను రూపొందించారని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రానున్న సమయంలో ప్రభుత్వం హడావుడిగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టారని చెప్పుకొచ్చారు. పారదర్శకత లేకుండా రూపొందించిన జాబితాను పున:పరిశీలించాలి. పదోన్నతుల అంశాన్ని జూన్ 7 తర్వాత చేపట్టేలా చూడాలని కోరారు. లేఖ కాపీలను పర్సనల్ అండ్ ట్రైనింగ్ సెక్రటరీ , కేంద్ర ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి చంద్రబాబు పంపించారు.


రాష్ట్రంలో నాన్‌ రెవెన్యూ ఐఏఎస్‌ పోస్టులు రెండు ఖాళీలున్నాయన్నారు చంద్రబాబు. ఈ రెండు పోస్టుల్లో తమ వారినే నియమించుకోవాలని ఇద్దరు అధికారులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోందని లేఖలో ప్రస్తావించారు. ఈ ఎంపిక ప్రక్రియలో ప్రస్తుత ప్యానెల్‌ బంధుప్రీతితో వ్యవహరించిందని ఆరోపించారు. ఈ ఖాళీల భర్తీలో అర్హత కలిగిన అధికారులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. గతంలో కూడా ఇదే తరహాలో ఇంటర్వ్యూలు నిర్వహించి ఇద్దరు అధికారులను ఐఏఎస్‌కు ఎంపిక చేశారని చంద్రబాబు ఆరోపించారు.


ఆ ఇద్దరిలో ఒకరు ముఖ్యమంత్రి కార్యాలయంలో, ఇంకొకరు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో పనిచేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. తాజాగా ఇంటర్వ్యూల కోసం ఎంపిక చేసిన ప్యానెల్‌లో ఉన్న కొందరు అధికారుల వ్యవహార శైలిపై విమర్శలు ఉన్నాయన్నారు. అందుకే ఇంటర్వ్యూలు నిర్వహించాలన్న ఆలోచనను యూపీఎస్సీ వాయిదా వేయాలని చంద్రబాబు కోరారు. జూన్ 4 తర్వాత కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకొన్న తర్వాత ఇంటర్వ్యూలను నిర్వహిస్తే ఆశావహుల్లో నమ్మకం కలుగుతుంది అన్నారు చంద్రబాబు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com