ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం సొంత జిల్లాలో.. వైసీపీ ఎమ్మెల్యేపై బావమరిది పోటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 02, 2024, 07:12 PM

ప్రొద్దుటూరు నుంచి వైఎస్సార్సీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా టీడీపీ నుంచి వరదరాజులు రెడ్డి బరిలో నిలిచారు. అయితే ప్రొద్దటూరు నుంచి ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి బామ్మర్ది పాతకోట బంగారు మునిరెడ్డి కూడా పోటీలో ఉన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున నామినేషన్ వేసిన మునిరెడ్డి.. సింహం గుర్తుపై పోటీ చేస్తున్నారు.


బావ పోటీ చేసిన చోటే బావమరిది కూడా పోటీ చేస్తున్నాడంటే.. ఇద్దరికీ పడదని మాత్రం అనుకోవద్దు. వీరిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. రాచమల్లు ఎమ్మెల్యేగా ఉండగా.. మునిరెడ్డి ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చెర్మన్‌గా పని చేస్తున్నారు. బావ కోసం ఏం చేయడానికైనా మునిరెడ్డి సిద్ధమేనని ప్రొద్దుటూరు రాజకీయాల గురించి తెలిసిన వారు చెబుతుంటారు.


గతంలో టీడీపీ నేత సుబ్బయ్య హత్యకు గురి కాగా.. ఎమ్మెల్యే రాచమల్లు ప్రోత్సాహంతోనే ఆయన బావమరిది తన భర్తను హత్య చేశాడని సుబ్బయ్య భార్య అపరాజిత ఆరోపించారు. సుబ్బయ్య హత్యతో తనకెలాంటి సంబంధం లేదని చౌడేశ్వరీ ఆలయంలో రాచమల్లు సత్య ప్రమాణం చేసినప్పటికీ.. తన భర్త వెనుక ఎమ్మెల్యే ప్రోద్బలం ఉందని అపరాజిత ఆరోపించారు.


బావతో సత్సంబంధాలే ఉన్నప్పటికీ.. బంగారు మునిరెడ్డి ఎమ్మెల్యే ఎన్నికల బరిలో నిలవడం పట్ల కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం బావకు మేలు చేయడం కోసమే మునిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. ఎన్నికల సంఘానికి మునిరెడ్డి సమర్పించిన పాత ఫొటోనే దీనికి నిదర్శమని చెబుతున్నారు. గుండు కొట్టించుకొని, ఎవరూ గుర్తుపట్టలేని రీతిలో ఉన్న ఫొటోను మునిరెడ్డి అఫిడవిట్ సమయంలో సమర్పించారు. తన పేరును సైతం పి.మునిరెడ్డి బంగారుగా వెల్లడించారు.


ఎమ్మెల్యేగా పోటీ చేయడం వల్ల పోలింగ్ రోజున నియోజకవర్గంలో అభ్యర్థి హోదాలో నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. అంతేకాదు ఆయన తరఫున పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లను నియమించుకోవచ్చు. తద్వారా తన బావకు వీలైనంత ప్రయోజనం చేకూర్చవచ్చనే ఆలోచనతోనే మునిరెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లోనూ మునిరెడ్డి బీసీ యునైటెడ్ ఫ్రంట్ తరఫున ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు నోటా కంటే 178 ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల అఫిడవిట్లోనూ ఆయన సరిగా గుర్తు పట్టలేని ఫొటోను అతికించారు. ఈసారి కూడా రాచమల్లుకు లబ్ధి చేకూర్చడం కోసమే మునిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారా..? లేదా? అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com