ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: భూ వివాదాలు లేకుండా చేస్తారా..? అసలు భూమే లేకుండా చేస్తారా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 29, 2024, 07:35 PM

ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌-2023ను రాష్ట్రంలో ఎంపిక చేసిన 16 రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ రిజిస్ట్రేషన్ కమిషనర్ ఇటీవలే ఆదేశాలు జారీ చేశారు. ఎంపిక చేసిన ఈ 16 సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల పరిధిలో స్థిరాస్తుల కొనుగోలుదారులకు ఒరిజినల్ డాక్యుమెంట్లకు బదులు జిరాక్స్ పత్రాలు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై వివాదం రాజుకుంటోంది. దేశంలో తొలిసారి అమలవుతోన్న ఈ చట్టం వల్ల తమ భూములకు రక్షణ లేకుండా పోతుందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.


ఈ చట్టం భూకబ్జాదారులకు వరంగా మారుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారులు చేసిన తప్పిదాల కారణంగా.. స్థిరాస్తుల వివాద పరిష్కారం కోసం కోర్టులకు వెళ్లిన ప్రజలు.. ఇప్పుడు పరిష్కారం కోసం తిరిగి అధికారుల దగ్గరకే వెళ్లాల్సి వస్తోందని లాయర్లు ఆరోపిస్తున్నారు. పారిశ్రామికవేత్తలు పెద్ద మొత్తంలో భూములను సేకరించాలనుకుంటే.. ఇబ్బందులు తలెత్తుతున్నాయనే ఉద్దేశంతో.. భూమిపై వివాదాలు కోర్టుల పరిధిలో ఉండొద్దనే ఉద్దేశంతో కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని న్యాయవాదులు చెబుతున్నారు. భూమి క్రయవిక్రయాల సమయంలో జరిగే అవకతవకలను ట్రైబ్యునళ్లలో ప్రభుత్వం నియమించే టీఆర్వోలు పరిష్కరిస్తారని ప్రభుత్వం చెబుతుండగా.. దీని వల్ల ప్రజలకు లాభం కంటే నష్టమే ఎక్కువని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.


మీ భూమి మీది కాకుండా పోతుందా..?


‘‘మీ పేరు మీదున్న భూమి.. తెల్లారే సరికే వేరే ఎవరి పేరు మీదో మారుతుంది.. మీ ఆస్తులకు మీరు యజమాని కాకుండా పోతారు.. భూయాజమాన్య వివాదాలపై విచారణ జరిపి తీర్పులిచ్చే అధికారం సివిల్స్ కోర్టులకు లేకుండా చేశారు.. కేవలం అప్పిలేట్ ట్రైబ్యునల్‌‌ను మాత్రమే ఆశ్రయించాలి. మీ భూమి ఎవరి పేరిట మారిందనేది మీకు మీరుగా తెలుసుకోవాలి. 90 రోజుల్లోగా తెలుసుకోలేకపోతే ఇక అంతే సంగతులు’’ అని ప్రచారం చేస్తున్న విపక్షం ప్రజల ఆందోళనను మరింత పెంచుతోంది.


ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా పట్టాదారు పాస్ బుక్, అడంగల్ లాంటి రెవెన్యూ రికార్డులు ఎందుకు పని రాకుండా పోతాయని.. ఈ ఆధారాలు ఏవీ లేకుండాపోతే.. భూములు ఎవరి చేతుల్లోకైనా వెళ్లే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. చిన్న, సన్నకారు రైతుల దగ్గర్నుంచి భూములను చట్ట ప్రకారం కొట్టేయడానికి వైసీపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.. తాము అధికారంలోకి వచ్చాక ఈ చట్టం లేకుండా చేస్తామని విపక్ష కూటమి చెబుతోంది.


ప్రభుత్వం ఏం చెబుతోందంటే..?


అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ విషయంలో ప్రభుత్వ స్పందన మరోలా ఉంది. ఈ చట్టం అమల్లోకి వస్తే 99 శాతం భూవివాదాలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ చట్టం అమల్లోకి వస్తే వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమి.. ఇలా అన్ని రకాల భూములకు సంబంధించి ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ వస్తుందని సర్కారు చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో భూములకు సంబంధించి 30కిపైగా రికార్డులున్నాయి. అయితే ఈ రికార్డుల్లో పేరున్నా.. వేరే వ్యక్తులు భూమి తమదని అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని.. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ అమల్లోకి వస్తే భూమి యజమానులకు భరోసా వస్తుందని ప్రభుత్వం చెబుతోంది.


వివాదాలు ఉన్న భూములను ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్‌లో నమోదు చేస్తారని.. అభ్యంతరాలు లేని పేర్లే టైటిల్ రిజిస్టర్‌లో నమోదు చేస్తారని.. వివాదాల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో ఒక ట్రైబ్యునల్, రాష్ట్ర స్థాయిలో మరో ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ట్రైబ్యునల్ తీర్పు మీద అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించొచ్చని చెబుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం భూ యజమానిని ఒకసారి నిర్ధారిస్తే అదే ఫైనల్ అని.. భూ వివాదం కారణంగా భూములను కోల్పోయే అవకాశం ఉండదని ప్రభుత్వం చెబుతోంది. టైటిల్‌ రిజిస్టర్‌లో పేరు నమోదైన తర్వాత.. రెండేళ్లలోపే అభ్యంతరాలు వ్యక్తం చేయాలని.. ఒకవేళ రెండేళ్లలోపు అభ్యంతరాలేవీ లేకపోతే.. ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదని ప్రభుత్వం చెబుతోంది.


మార్చి తొలి వారంలో ప్రభుత్వం ప్రధాన సలహాదారు అజయ్ కల్లం ఈ చట్టం గురించి మాట్లాడుతూ.. దేశంలోని 12 రాష్ట్రాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను అమలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే ఎవరైనా భూ రికార్డుల్లో మార్పులు చేయాలని భావిస్తే.. వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందుతుందని.. దీంతో తప్పులు జరిగేందుకు అవకాశం ఉండదన్నారు.


మరి ఈ విషయాల సంగతి ఏంటి..?


అయితే టీఆర్వోలుగా ఎవరిని నియమిస్తారు..? దీనికి సంబంధించిన మార్గదర్శకాలేంటి..? ఈ ట్రైబునళ్లు స్వయంప్రతిపత్తితో పని చేయగలవా..? ప్రభుత్వంలోని కీలక నేతల నుంచి వచ్చే ఒత్తిళ్లను టీఆర్వోలు ఎలా అధిగమిస్తారు..? కోర్టుల పరిధి నుంచి భూ వివాదాలను తప్పించడం వల్ల తలెత్తే పర్యవసనాలేంటి..? భూ యజమాన్య హక్కులు మారినప్పుడు.. పాత యజమానికి సమాచారం ఇస్తారా..? యజమానికి వేరే ప్రదేశంలో ఉంటే ఎలా..? ఇలా చాలా ప్రశ్నలకు సమాధానం ఇస్తేనే.. ఈ చట్టం పట్ల ప్రజల్లో నమ్మకం కలుగుతుంది. ప్రజలకు పూర్తి అవగాహన వచ్చాకే ఇలాంటి చట్టాలను అమలు చేస్తే అటు ప్రజలు, ఇటు అధికారంలో ఉన్నవారికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవనే భావన వ్యక్తం అవుతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com