84 లక్షల విలువైన నాణేలు చోరీ

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 16, 2018, 02:04 PM
 

కోల్‌కతా: కంచె చేను మేస్తే ఎలా ఉంటుందో ఈ బ్యాంక్ మేనేజర్ వ్యవహారాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కస్టమర్ల డబ్బుకు కాపలాగా ఉండాల్సిన మేనేజరే దొంగయ్యాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.84 లక్షలు దొంగిలించాడు. అన్నీ కాయిన్సే కావడం అసలు విశేషం. కోల్‌కతాకు 82 కిలోమీటర్ల దూరంలోని మెమారిలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్‌గా పని చేస్తున్న తారక్ జైశ్వాల్ ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. అతడు ఈ శాఖలో 17 నెలలుగా పని చేస్తున్నాడు. ఈ 17 నెలల నుంచి ఒకటే పనిగా పెట్టుకున్నాడు. అది రోజుకు కొన్ని నాణేలను దొంగతనం చేయడం. అంటే నెలకు రూ.50 వేల విలువైన కాయిన్స్. మొత్తానికి వార్షిక ఆడిట్‌లో దొంగ దొరికిపోయాడు. నవంబర్ 27 నుంచి ఈ ఆడిట్ మొదలవగా తారక్ బండారం బయటపడింది. శుక్రవారం పోలీసులు అతన్ని అరెస్ట్ చేయగా.. తాను దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. లాటరీలకు అలవాటు పడిన తారక్... వాటిని కొనుగోలు చేయడానికి ఈ నాణేలను దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. మొత్తం రూ.84 లక్షల మొత్తాన్ని అతడు లాటరీ టికెట్లకే ఖర్చు చేయడం విశేషం. ఆడిటింగ్‌లో భాగంగా భారీ ఎత్తున కాయిన్లు మిస్ కావడం గుర్తించారు. తన దొంగతనం బయటపడుతుందని భయపడని తారక్.. లీవ్ కూడా పెట్టకుండా ఆఫీస్‌కు రావడం మానేశాడు. బ్యాంక్‌లోని కరెన్సీ మొత్తం అతని ఆధీనంలోనే ఉండటంతో తారక్‌పైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతన్ని బ్యాంక్‌కు రావాలని కోరినా.. రాకుండా తన భార్యను పంపించాడు. రీజినల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. తారక్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అతడు తప్పు అంగీకరించాడు.