ప్రధాని హోదాలో తొలిసారి రాయ్ బరేలీకి వచ్చిన మోదీ

  Written by : Suryaa Desk Updated: Sun, Dec 16, 2018, 11:22 AM
 

గాంధీల కుటుంబానికి ఎన్నో దశాబ్దాలుగా పట్టున్న ప్రాంతమైన రాయ్ బరేలీలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు తొలిసారిగా పర్యటించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో రాయ్ బరేలీ, అమేథీల్లో విజయమే లక్ష్యంగా ఆయన పర్యటన సాగగా, రాయ్ బరేలీలో రూ. 1,100 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులు, ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.రాయ్ బరేలీ నుంచి ప్రస్తుతం సోనియా గాంధీ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం 9.50 గంటల సమయంలో రాయ్ బరేలీలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ హెలిపాడ్ కు చేరుకున్న ఆయన, ఫ్యాక్టరీని సందర్శించారు. ఆపై హమ్ హఫర్ ఎక్స్ ప్రెస్ కు పచ్చజెండా ఊపారు. రాయ్ బరేలీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం ఆయన అలహాబాద్ వెళ్లి, వచ్చే సంవత్సరం జరగనున్న కుంభమేళా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. మోదీ పర్యటన ఏర్పాట్లను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి పర్యవేక్షించారు. మోదీ పర్యటన 2019 ఎన్నికల ప్రచారానికి శంఖారావంగా భావించవచ్చని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించారు. ఏప్రిల్ నుంచి సోనియాగాంధీ తన సొంత నియోజకవర్గాన్ని సందర్శించలేదని ఆరోపించారు.