అది ఉంటే మీది ఈఎంవీ కార్డే... లేదంటే మార్చుకోవాలి

  Written by : Suryaa Desk Updated: Fri, Dec 14, 2018, 03:07 PM
 

క్రెడిట్‌/డెబిట్‌ కార్డులను అప్‌గ్రేడ్‌ చేసుకోండి అంటూ మీ ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయా.. మీరు వాటిని పట్టించుకోకుండా వదిలేస్తున్నారా.. అయితే డిసెంబరు 31 తర్వాత మీ కార్డులేవీ పనిచేయవు. అవునా.. ఎందుకు? కార్డులు బ్లాక్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనేగా మీ సందేహం. అయితే ఇది చదవండి.


మోసాపూరిత లావాదేవీల నుంచి వినియోగదారులను రక్షించేందుకు రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.మ్యాగ్‌స్ట్రైప్‌ డెబిట్‌ కార్డులు ఉన్న ఖాతాదారులు వాటి స్థానంలో ఈఎంవీ చిప్‌ డెబిట్‌ కార్డులు తీసుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. ఆయా బ్యాంకులు ఈ సేవలను పూర్తిగా అందించాలని, ఈ ఏడాది చివరి లోగా ప్రతి ఒక్కరూ చిప్‌ ఆధారిత కార్డులు తీసుకోవాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.


ఈ చిప్‌ ఆధారిత కార్డులను ఆర్‌బీఐ 2016 నుంచే తప్పనిసరి చేసింది.2016 జనవరి 31 తర్వాత బ్యాంకు ఖాతాలు తెరిచిన కొత్త కస్టమర్లు, క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డులను దరఖాస్తు చేసుకున్న వారిని చిప్‌ ఆధారిత కార్డులే జారీ చేయాలని ఆర్‌బీఐ బ్యాంకులను ఆదేశించింది. అంతకుముందు నుంచి ఉన్న కార్డులను కూడా తప్పనిసరిగా మార్చాలని ఆర్‌బీఐ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ఈ విషయంపై ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు సమాచారమందిస్తున్నాయి.


ఈ ఏడాది డిసెంబరు 31లోగా మ్యాగ్‌స్ట్రైప్‌ డెబిట్‌ కార్డుల స్థానంలో చిప్‌ ఆధారిత కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని లేదంటే ఆ కార్డులను శాశ్వతంగా నిలిపివేస్తామని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ లేదా బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళ్లి ఈ కార్డులను మార్చుకునే సౌలభ్యం ఉంది.మరి మీ కార్డులు చిప్‌ ఆధారిత కార్డులా కాదా అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలంటే.. మీ క్రెడిట్‌/డెబిట్‌ కార్డు ముందువైపు బంగారు రంగులో చిన్న చిప్‌ ఉంటుంది. అది ఉంటే మీది ఈఎంవీ కార్డే. లేదంటే మార్చుకోవాల్సి ఉంటుంది.