సరికొత్త మొబైల్ యాప్ ను ఆవిష్కరించిన వైసీపీ ఎమ్మెల్యే రోజా!

  Written by : Suryaa Desk Updated: Fri, Dec 14, 2018, 02:32 PM
 

వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈరోజు మొబైల్ యాప్ ను ఆవిష్కరించారు. ‘మై ఎమ్మెల్యే-రోజా సెల్వమణి’ పేరుతో ఈ యాప్ ను తయారుచేశారు. ఈ విషయమై రోజా మాట్లాడుతూ.. ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకే యాప్ ను తీసుకొచ్చామన్నారు. నగరిలో గత నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధి పనులను యాప్ ద్వారా ప్రజల ముందుకు తీసుకెళతామన్నారు. అలాగే నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ యాప్ ద్వారా తనకు ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. దీని ద్వారా అపాయింట్ మెంట్ కూడా తీసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం నగరిలో మంచినీటి సౌకర్యం కల్పించామనీ, పేదల కోసం వైఎస్సార్ క్యాంటీన్ లను ప్రారంభించామని తెలిపారు. టీడీపీ నేతలు ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటూ ఉంటే తాము మాత్రం ప్రజలకు లబ్ధి చేకూర్చే దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.