మిరాసి అర్చకులపై టీటీడీ నిర్ణయాన్ని కొట్టేసిన హైకోర్టు

  Written by : Suryaa Desk Updated: Fri, Dec 14, 2018, 12:54 PM
 

మిరాసి అర్చకుల పదవి విరమణ అంశంపై హైకోర్టులో టిటిడికి ఎదురు దెబ్బ తగిలింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో వంశపారంపర్య అర్చకులుగా పనిచేస్తున్న వారు 65 సంవత్సరాలకే పదవి విరమణ చేయాలనీ టిటిడి చేసిన తీర్మానాన్ని హై కోర్టు కొట్టివేసింది. శారీరక దృఢత్వం ఉన్నంత వరకు వారిని కొనసాగించాలని ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై టిటిడి అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 


ఈ ఏడాది మే 16 న జరిగిన టిటిడి పాలకమండలి సమావేశంలో టిటిడి 65 సంవత్సరాలు నిండిన అర్చకులకు రిటైర్మెంట్ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులు సహా వంశపారంపర్యంగా అర్చకత్వం నిర్వహిస్తున్న పలువురు అర్చకులు స్వామివారి విధుల నుండి దూరం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో మరికొందరు అర్చకులతో కలిసి రమణ దీక్షితులు టిటిడి అధికారులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా తీవ్ర విమర్శలు చేసారు.టిటిడిలో జరుగుతున్న అవకతవకలను ప్రశ్నించినందుకే తనను స్వామివారి సేవ నుండి తప్పించారన్న ఆరోపణలను గుప్పిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే టీటీడీ తీర్మానంపై అర్చకులు ఏ.వి శేషాద్రితో పాటు మరో అర్చకుడు హై కోర్టును ఆశ్రయించారు.  


టీటీడీ చేసిన తీర్మానాన్ని హై కోర్టు కొట్టివేయడంతో మిగిలిన అర్చకులు కూడా కోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. అయితే పదవి విరమణ చేసిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకునే పక్షంలో టిటిడికి మరిన్ని సమస్యలు తలెతే అవకాశాలున్నాయి. పదవి విరమణతో ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేసే క్రమంలో వేద విద్య ప్రవేశికలో ఉత్తీర్ణులైన 12 మందిని అర్చకులుగా టిటిడి ఎంపిక చేసింది. వీరిలో అత్యధికులు మిరాశి వంశపారంపర్య అర్చకులే. ఒకవేళ హై కోర్టు ఆదేశాలను టిటిడి అమలు చేస్తే మాత్రం వీరందరూ విధుల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. మరోవైపు దశబ్దాలుగా ప్రధాన అర్చకులుగా గౌరవం పొందిన అర్చకులు కోర్టు ఆదేశాల మేరకు సంభావన అర్చకులుగా పనిచేసేందుకు ముందుకు వస్తారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద హై కోర్టు తీసుకున్న నిర్ణయం టిటిడిలో పనిచేస్తున్న అర్చకుల మధ్య చిచ్చు పెట్టేలా కనిపిస్తుంది.