జాతీయ‌స్థాయిలో మ‌హాకూట‌మి ఏర్పాటుకు చంద్ర‌బాబు చొరవ

  Written by : Suryaa Desk Updated: Mon, Dec 10, 2018, 04:09 PM
 

కేంద్ర ప్రభుత్వం, మోడీకి వ్యతిరేకంగా 14 పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చొరవతో.. హస్తినలో సమావేశమవుతున్న ఆయా పార్టీల నేతలంతా.. దేశ రాజకీయాల్లో మహా కూటమి ఏర్పాటు, విధి విధానాలపై చర్చించనున్నారు. పార్లమెంట్‌ హాల్లో జరుగుతున్న ఈ భేటి కోసం ఇప్పటికే వివిధ పార్టీల జాతీయ నేతలు హాజరయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమతా బెనర్జీతో సహా.. వివధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు..


రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత మరిన్ని పార్టీలు వస్తాయని కాంగ్రెస్‌, టీడీపీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సమయం ఎంతో దూరం లేనందున కూటమి కార్యకలాపాలును వేగంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మోడీని గద్దె దించి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్న ఏకైక అజెండాతో అన్ని పార్టీలతో తొలి సమావేశం జరుగుతోంది. .


 


కూటమి పార్టీలు జాతీయ స్థాయిలో ఎలా కలిసి పనిచేయాలి, వారివారి రాష్ట్రాల పరిధిలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఒక అవగాహనకు రానున్నారు. దీనికి తోడు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంపైనా చర్చించనున్నారు. రైతాంగ సమస్యలు, నిరుద్యోగం, పెద్దనోట్ల రద్దు, రాఫెల్‌ కుంభకోణం, జీఎస్టీ, పెట్రోల్‌ ధరలపైనా నేతలు చర్చించే అవకాశం ఉంది.


 


తరువాత ఏపీ భవన్‌లో నిర్వహించే టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి చంద్రబాబు హాజరుకానున్నారు. రేపటి నుంచి జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాత్రి తొమ్మిదిన్నరకు తిరిగి ఆయన విజయవాడ బయల్దేరతారు.