టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఇటీవల స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్ పై విడుదలైన చంద్రబాబు కంటికి శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం కొన్నిరోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. మొన్న ఢిల్లీలో తన న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తనయుడి వివాహ రిసెప్షన్ కు సతీసమేతంగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన రేపు (నవంబరు 30) కుటుంబ సమేతంగా తిరుమల విచ్చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 2.25 గంటలకు హైదరాబాదులో బయల్దేరి 3.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడ్నించి రోడ్డు మార్గం ద్వారా తిరుమల చేరుకుంటారు. రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. డిసెంబరు 1 (శుక్రవారం) ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం 11.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో విజయవాడ బయల్దేరనున్నారు. 12.40 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడ్నించి రోడ్డుమార్గంలో మధ్యాహ్నం 1.30 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. ఇదిలావుంటే చంద్రబాబు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయం, సింహాద్రి అప్పన్న ఆలయాన్ని కూడా సందర్శించనున్నట్టు తెలుస్తోంది.