తెలంగాణలో ఓటు హక్కు కలిగిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం రేపు సెలవును ప్రకటించింది. రేపు తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగం చేస్తున్న పలువురికి తెలంగాణలో ఓటు హక్కు ఉంది. అలాంటి వారికి జగన్ ప్రభుత్వం... వేతనంతో కూడిన సెలవును మంజూరు చేసింది. ఈ మేరకు సచివాలయ ఉద్యోగుల సంఘం వినతి మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సెలవు మంజూరు చేశారు. తెలంగాణలో ఓటు హక్కు కలిగిన ఉద్యోగులు సరైన ఆధారాలు చూపించి సెలవు పొందవచ్చునని స్పష్టం చేశారు. తెలంగాణలో రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. కొన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకు ముగియనుంది.