ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఐఏఎస్ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, కళాశాల విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్‌కు నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది. జైలు శిక్ష అనుభవించేందుకు హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడీషియల్ దగ్గర డిసెంబరు 8లోపు లొంగిపోవాలని ఆదేశించింది. నిబంధనల మేరకు వారిని జైలుకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీకి సూచించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు తీర్పు వెల్లడించారు.
గతేడాది జులై 26న అన్‌ఎయిడెడ్ లెక్చరర్లను ఎయిడెడ్ కళాశాలల్లోకి తీసుకోవాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్, డైరెక్టరేట్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆ తీర్పును సంబంధిత శాఖ అధికారులు అమలు చేయకపోవడంతో సబ్బవరపు సూరిబాబుతో పాటు మరికొందరు అన్‌ఎయిడెడ్ లెక్చరర్లు హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయలేదని తేల్చారు. దాంతో సంబంధిత అధికారులకు జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.