పంబకు వెళ్తున్న మహిళల్ని బస్సు నుంచి దింపేశారు

  Written by : Suryaa Desk Updated: Tue, Oct 16, 2018, 12:56 PM
 

పంబ: కొట్టాయం నుంచి పంబాకు బస్సులో వెళ్తున్న ఇద్దరు మహిళల్ని అర్ధాంతరంగా లాగేశారు. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించరాదు అని బీజేపీ కార్యకర్తలు కేరళలో ధర్నా చేస్తున్నారు. మహిళలకు ప్రవేశం కల్పిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఆందోళనలు మిన్నంటాయి. రేపటి నుంచి శబరిమల ఆలయం భక్తుల కోసం తెరవనున్నారు. దీంతో ఇవాళ్టి నుంచే పంబకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. అయితే ఇద్దరు సాధారణ మహిళలు ఓ బస్సులో పంబకు వెళ్లడాన్ని గమనించిన ఆందోళనకారులు వాళ్లును అడ్డుకున్నారు. ఆ ఇద్దర్నీ బస్సు నుంచి దింపేశారు. అయితే ఆ ఇద్దరూ మహిళా జర్నలిస్టులు అని తేలింది. పంబ వద్ద పరిస్థితిని అంచనా వేసేందుకు తాము అక్కడకు వెళ్తున్నట్లు వారు చెప్పారు. నిలక్కల్ వద్ద ఈ ఘటన జరిగింది. పంబకు వెళ్లే ప్రతి బస్సును ఓ గ్యాంగ్ ఎప్పటికప్పుడూ చెక్ చేస్తోంది. దానిలో భాగంగానే ఇవాళ ఇద్దర్నీ బస్సు నుంచి దింపేశారు. మ‌హిళ‌ల‌ను అడ్డుకునే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఎం విజ‌య‌న్ అన్నారు.