ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ అరెస్టుల పర్వం చూస్తే..మైనర్ వివాహాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలుస్తోంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 06, 2023, 08:45 PM

మనదేశంలో మైనర్ బాలికల వివాహం సంఖ్య ఇంకా తగ్గలేదని తాజాగా అస్సాంలో జరిగిన అరెస్ట్ ల పర్వంచూస్తే అర్థమవుతోంది. ఇదిలావుంటే పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు.. దేశంలో ఎక్కడికి వెళ్లినా భజంత్రీల శబ్దాలు వినిపిస్తాయి. కానీ అసోంలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటుండగా.. కొందరు వివాహాలను రద్దు చేసుకుంటున్నారు. అసోం ముఖ్యమంత్రి బిశ్వంత్ శర్మ జారీ చేసిన ఆదేశాలే దీనికి కారణం. ముఖ్యమంత్రి ఆదేశాలకు పెళ్లిళ్లు ఆగిపోవడానికి కారణం ఏంటని అనుకుంటున్నారా..?


అసోంలో బాల్య వివాహాలు ఎక్కువ. ముఖ్యంగా పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చే వారు ఆడ పిల్లలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తుంటారు. దీంతో ఆ రాష్ట్రంలో బ్యాల వివాహాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. అసోం ముఖ్యమంత్రి మాటల్లోనే చెప్పాలంటే.. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో లక్ష మందికిపైగా అమ్మాయిలు 18 ఏళ్లు నిండక ముందే పెళ్లిళ్లు చేసుకోగా కొందరు పిల్లల్ని కూడా కన్నారట. ఓ అమ్మాయి అయితే 9 ఏళ్ల వయసులోనే తల్లయ్యిందని సాక్షాత్తూ సీఎం చెప్పడం అక్కడి దుస్థితికి అద్దం పడుతోంది.


రాష్ట్రంలో బాల్య వివాహాలపై ఉక్కుపాదం మోపాలని బిశ్వంత్ శర్మ పోలీసులు, అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 18 ఏళ్లలోపు వయసున్న అమ్మాయిలను పెళ్లి చేసుకున్న వారిని అరెస్ట్ చేయండని జనవరి 23న అసోం క్యాబినెట్ పోలీసులకు మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో ఆదివారం నాటికి బాల్య వివాహం చేసుకున్న/చేసిన 2278 మందిని అరెస్ట్ చేసిన అసోం పోలీసులు 4074 కేసులు నమోదు చేశారు. భారీ స్థాయిలో అరెస్టులు జరుగుతుండటంతో బారక్ వ్యాలీలో వందకుపైగా పెళ్లిళ్లు రద్దయ్యాయి లేదా వాయిదా పడ్డాయి.


ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు మైనర్లను పెళ్లాడిన వారిపై పోక్సో చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. 14-18 ఏళ్ల మధ్య ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకున్న వారిని బాల్యవివాహ నిరోధక చట్టం 2006 సెక్షన్ కింద అరెస్ట్ కూడా చేస్తున్నారు. పెళ్లి కొడుకులనే కాదు.. ఈ పెళ్లిళ్లు జరిపించిన పంతుళ్లు, ఖాజీలపైనా చర్యలు తీసుకుంటామని అసోం సీఎం హెచ్చరించారు. ఆదివారం 60 మంది పూజారులు, ఖాజీలను అరెస్ట్ చేసినట్టు డీజీపీ జీపీ సింగ్ తెలిపారు. బాల్య వివాహం చేసుకున్న వారిపై 4000 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. దిగువ, మధ్య అసోం జిల్లాల్లో బంగ్లాదేశ్ వలసదారులు ఎక్కువ. ఈ ప్రాంతాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి.


బాల్య వివాహాలు చేసుకున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తుండటంతో.. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలేమీ మాకు అవసరం లేదు.. మా భర్తలను విడిచిపెట్టండని మైనర్లు డిమాండ్ చేస్తున్నారు. తమ భర్తలను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే.. మాకు తిండిపెట్టేది ఎవరని వారు ప్రశ్నిస్తున్నారు. పోలీసు స్టేషన్ల ముందు ధర్నాలకు సైతం దిగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టుల పర్వం కొనసాగుతుండండటంతో చాలా మంది వివాహాలను రద్దు చేసుకుంటున్నారు లేదంటే వాయిదా వేసుకుంటున్నారు. కచర్ జిల్లాలో గత మూడు రోజుల్లోనే వందకుపైగా పెళ్లిళ్లు నిలిచిపోయాయి. అరెస్టుల నేపథ్యంలో ఎవరూ ఊహించిన విషాదాలు సైతం జరుగుతున్నాయి. తను ప్రేమించిన అబ్బాయిని తల్లిదండ్రులు పెళ్లి చేసుకోనీయడం లేదని 16 ఏళ్ల అమ్మాయి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మైనార్టీ తీరకపోవడంతో తాము పెళ్లికి ఒప్పుకోలేదని.. లేచి పోయి పెళ్లి చేసుకుంటామని తన బిడ్డ బెదిరించిందని.. పోలీసులు అరెస్ట్ చేస్తారని తాము నచ్చజెప్పబోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడిందని మృతురాలి తల్లి వాపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com