తెలుగు ప్రజలకు వైఎస్‌ జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 13, 2018, 12:08 PM
 

 మకర సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సొంత గ్రామాలతో ప్రజలకు ఉన్న చెక్కుచెదరని ఆత్మీయతలు, అనుబంధాలకు ప్రతీక సంక్రాంతి అని ఆయన అన్నారు. సంక్రాంతి అంటేనే రైతులు, పల్లెలు ప్రతి ఒక‍్కరికీ గుర్తుకు రావడం సహజమని, పంటలు బాగా పండి రైతులు సంతోషంగా, ప్రతి ఒక్కరి ఇల్లు ఆనందంగా ఉండాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.


భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటల, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు సంక్రాంతి పేరు చెబితేనే అందరికీ గుర్తుకు వస్తాయని అన్నారు. అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగు నేల మీద రైతన్నలు, గ్రామీణ వృత్తులవారు సుఖ, సంతోషాలతో తులతూగాలని వైఎస్‌ జగన్‌ తన శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు.