ట్రంప్‌ లండన్‌ పర్యటన రద్దు

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 13, 2018, 11:52 AM
 
వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యూకే పర్యటనను రద్దు చేసుకున్నారు. లండన్‌లో వచ్చే నెలలో నూతన ఎంబసీ కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించడానికి వెళ్లాల్సి ఉండగా ట్రంప్‌ వెళ్లడంలేదు. ట్రంప్‌ లండన్‌ వస్తే పెద్ద ఎత్తున నిరసన చేపట్టేందుకు ఆయన వ్యతిరేకులు సన్నాహాలు చేశారు. బ్రిటీష్‌ గ్రూప్స్‌కు సంబంధించిన ఫార్‌-రైట్‌ పై ట్రంప్‌ రీట్వీట్‌ చేయడంతో వాటిని తొలగించమని లండన్‌ చట్టసభ సభ్యులు డిమాండు చేశారు.

అలాగే గతేడాది లండన్‌ మేయర్‌ సాదిక్‌ ఖాన్‌పై ఉగ్రవాదుల దాడిని విమర్శించారు. దీంతో భయపడి లండన్‌ పర్యటనను రద్దు చేసుకున్నారని అన్నారు. కాగా, ట్రంప్‌ శుక్రవారం రాత్రి తన ట్విట్టర్‌లో పర్యటన రద్దుకు సంబంధించిన విషయాన్ని ప్రకటించారు. గత ఒబామా ప్రభుత్వం సెంట్రల్‌ లండన్‌లో ఉన్న అమెరికా ఎంబసీ కార్యాలయాన్ని దూరంగా వేరే చోటుకు తరలించడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒబామా లండన్‌ ఎంబసీని పల్లీలకు అమ్మేశారని, ఇది చాలా చెత్త డీల్‌ అని ట్వీట్‌ చేశారు. అందుకే తాను కొత్త కార్యాలయం ప్రారంభించేందుకు వెళ్లడం లేదని చెప్పుకొచ్చారు. ఒబామా హయాంలో ఎంబసీని లండన్‌లోని గ్రోస్‌వెనార్‌ స్క్వేర్‌ నుంచి థేమ్స్‌ నది తీరంలోని నైన్‌ ఎల్మ్‌ ప్రాంతానికి తరలించారు.

'లండన్‌ పర్యటన రద్దు చేసుకోవడానికి కారణం.. లండన్‌లో మంచి ప్రాంతంలో ఉన్న ఎంబసీని పల్లీలకు అమ్మేసిన ఒబామా అడ్మినిస్ట్రేషన్‌కు నేనేమీ అభిమానిని కాదు, దూర ప్రాంతంలో భవనం కట్టడానికి కేవలం 1.2 బిలియన్‌ డాలర్లకు అమ్మేశారు. చెత్త డీల్‌. నన్ను వచ్చి రిబ్బన్‌ కట్‌ చేయమన్నారు..నో' అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. లండన్‌లో జనవరి 16న కొత్త కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి యూఎస్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ రెక్స్‌ టిల్లర్‌సన్‌ వెళ్లనున్నారు. లండన్‌ పర్యటనలో ట్రంప్‌ బ్రిటన్‌ ప్రధాని థెరిసా మేతో కూడా సమావేశం కావాల్సి ఉంది.కాగా, ఆయన పర్యటన రద్దు చేసుకోవడంతో ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉందని కొందరు అభిప్రాయ పడ్డారు.