వణికించిన బౌల్ట్.. చిత్తుచిత్తుగా ఓడిన పాక్

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 13, 2018, 11:43 AM
 

డ్యునెడిన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో పాకిస్థాన్ చిత్తుగా ఓడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 257 పరుగులు చేసింది. బదులుగా పాక్ జట్టు 27.2 ఓవర్లలో 74 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఆతిథ్య జట్టు 183 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డేల్లో పాకిస్థాన్‌కు ఇది మూడో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. గత పాతికేళ్లలో ఓ వన్డే మ్యాచ్‌లో పాక్ జట్టు ఇంత తక్కువ స్కోరుకే పరిమితం కావడం ఇదే తొలిసారి. న్యూజిలాండ్‌పై వంద పరుగుల్లోపు పాక్ ఆలౌట్ కావడం కూడా ఇదే ప్రథమం.


కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ధాటికి పాక్ బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. 7.2 ఓవర్లలో బౌల్ట్ 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చాడు. ఓ దశలో పాక్ 32 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. కానీ చివరి వికెట్‌కు హసన్ అలీ (14), రుమన్ రాయిస్ (16) జోడి 22 పరుగులు జోడించింది. దీంతో పాక్‌ 74 పరుగులైనా చేయగలిగింది. ఐదు వన్డేల సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల‌ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్ మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది.