ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగలం

  Written by : Suryaa Desk Updated: Sat, Jan 13, 2018, 08:58 AM
 

అవినీతి నిరోధక శాఖ చరిత్రలోనే తొలిసారిగా భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఓ అధికారి పట్టుబడ్డాడు. ఓ కంపెనీకి ఇన్‌పుట్‌ పన్ను రాయితీ చెల్లించేందుకుగాను రూ.22.5 లక్షలు లంచం తీసుకుంటూ వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఏడుకొండలు ఏసీబీ అధికారులకు చిక్కారు. వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో ఏడుకొండలు తన ఛాంబర్‌లోనే ఈ భారీ మొత్తాన్ని తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన ప్రస్తుతం చెక్‌ పోస్టుల ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ముందస్తు సమాచారం ఆధారంగా కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులోని వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయంలో ఏసీబీ డీజీ ఠాకూర్‌ నేతృత్వంలో శుక్రవారం (జనవరి 12) అధికారులు సోదాలు నిర్వహించారు.


 


ఈ కేసులో లంచం తీసుకున్న ఏడుకొండలు సహా సూపరింటెండెంట్‌ అనంతరెడ్డితో పాటు లంచం ఇచ్చిన కంపెనీ డిప్యూటీ మేనేజర్‌ సత్యనారాయణ, కంపెనీ లీగల్‌ అడ్వయిజర్‌ గోపాలశర్మపై కేసు నమోదు చేశారు. అవినీతి కేసులో పట్టుబడ్డ గోపాల్ శర్మ జేఏసీ కో కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.


 


వాణిజ్య పన్నుల శాఖలో రూ.25 లక్షలు చేతులు మారుతున్నట్లు ఫిర్యాదు వచ్చిందని, దీంతో నిఘా పెంచామని డీజీ ఆర్పీ ఠాకూర్‌ తెలిపారు. ఉద్యోగులు ఎవరూ లేని సమయంలో కంపెనీ ప్రతినిధులను పిలిచారని, మరో రూ.2.5 లక్షలు చేతులు మారినట్లు ఆయన తెలిపారు. ఐటీడీ సిమెంటేషన్ సంస్థ.. విశాఖ, గంగవరం పోర్ట్ బెర్త్ నిర్మాణాలను చేపడుతోంది.