చంద్రబాబు బలపడితే బిజెపికి లాభం లేదని మోడీ భావన : నారాయణ

  Written by : Suryaa Desk Updated: Thu, Jan 11, 2018, 03:30 PM
 

ఎపిలో చంద్రబాబునాయుడు బలపడితే బిజెపికి లాభం లేదని ప్రధాని మోడీ భావిస్తున్నారని సిపిఐ నేత నారాయణ చెప్పారు. ఎపికి సహకరిస్తే దానిని ఉపయోగించుకుని చంద్రబాబు బలపడతారని మోడీ భయపడుతున్నారని ఆయన అన్నారు. ఎపిలో తామే బలపడాలని మోడీ అనుకుంటున్నారని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని ప్లానింగ్‌ సూపర్‌గా ఉందని అన్నారు. తాము అమరావతిలో సెక్రటేరియట్‌ సహా అన్ని ప్రాంతాలు తిరిగామని ఆయన చెప్పారు. 60-70 ఏళ్ల వరకూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందని ఆయన అన్నారు. చంద్రబాబును పొగుడుతూ, మోడీపై నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోడీ కొత్త రాజధానికి కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చిన మోడీ మట్టి కొట్టిపోయారని ఆయన అన్నారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ మూడు నామాలు పెట్టి వెళ్లిపోయారని సిపిఐ నాయకుడు నారాయణ వ్యాఖ్యానించారు. ఎపికి ప్రత్యేక హోదా లేదని, అమరావతి లేదని, పోలవరం ఊసు లేదని ఆయన చెప్పారు. ఈ రకంగా మూడు నామాలు పెట్టారని ఆయన అన్నారు.