మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్‌

  Written by : Suryaa Desk Updated: Thu, Dec 07, 2017, 07:43 AM
 

 మహారాష్ట్రలోని జింగనూర్‌ అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మహిళలతో సహా ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. మరో పది మంది గాయపడ్డారు. అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ జరుపుతున్న భద్రతాదళాలకు ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులు ప్రారం భించటంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని, ఇందులో ఏడుగురు మరణించారని అధికారులు చెప్పారు. మావోయిస్టు పార్టీ ఈ నెల 2 నుండి 8వ తేదీ వరకూ ప్రజా విముక్తి గెరిల్లా సైనిక వారోత్సవాలను జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ధనోరా, బామ్రాగఢ్‌ ప్రాంతాలలో హింసాత్మక కార్యకలాపాలు చెలరేగవచ్చన్న సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్‌ను ఉధృతం చేశాయి. వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టులు పోలీసు ఇన్ఫార్మర్ల పేరుతో పలు సందర్భాలలో కనీసం ఐదుగురిని హత్య చేశారని, ఇద్దరు భద్రతా సిబ్బందిని కూడా కాల్చి చంపారని అధికారులు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా యాంటీ నక్సల్‌ విభాగానికి చెందిన ఉన్నతాధి కారులు, గచ్చిరోలి పోలీసులు, ఇతర భద్రతా దళాలు గత వారం రోజులుగా నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలలో మకాం వేసి కూంబింగ్‌ను ఉధృతం చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.