'బిచ్చగాడు'తో తన టాలెంట్ ఏంటో తెలుగు ప్రేక్షకులకు రుజువు చేసిన టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోని. తన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే కచ్చితంగా అందులో కొత్తదనం ఉంటుందనేది ప్రేక్షకుల ఆలోచన. ఈసారి పూర్తి పొలిటికల్ డ్రామా 'యమన్' సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు విజయ్. మరి ఈ యమన్ ఆడియెన్స్‌కు ఎంతవరకు రీచ్ అయిందో.. ఈ రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ: దేవరకొండ గాంధీ(విజయ్ ఆంటోని)కి రాజకీయాల్లో పట్టు ఉంది. ఆ సామర్ధ్యంతోనే ఎన్నికల్లో నిలబడాలని అనుకుంటాడు. కానీ తన ప్రత్యర్ధులు అతడిని అంతం చేస్తారు. దీంతో గాంధీ భార్య, తన బిడ్డ దేవరకొండ అశోక్ చక్రవర్తి(విజయ్ ఆంటోని)తో కలిసి చనిపోవాలని భావించి విషం తీసుకుంటుంది. కానీ కొడుకుతో సహా ఆమె చేసిన ఈ ఆత్మహత్యాయత్నంలో అశోక్ బతికి బయటపడతాడు.
ఇక అప్పటినుండి అశోక్ తన తాతయ్య(సంగిలి మురుగన్) దగ్గర పెరుగుతూ ఉంటాడు. అశోక్ పెరిగి పెద్దయిన తరువాత తన తాతయ్యకు ఆరోగ్యం పాడవుతుంది. ఆపరేషన్ చేయించాల్సిన పరిస్థితి. కానీ అశోక్ దగ్గర అంత డబ్బు ఉండదు. దీంతో డబ్బు కోసం ఓ యాక్సిడెంట్ కేసు తన మీద వేసుకొని జైలుకి వెళ్తాడు. ఈ ఒక్క ఇన్సిడెంట్ తన జీవితాన్నే మార్చేస్తుంది. అశోక్ తన తెలివితేటలతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటాడు. తనకు మాజీ ఎమ్మెల్యే కరుణాకర్(త్యాగరాజన్) అండ దొరుకుతుంది. అశోక్‌ను అహల్య (మియా జార్జ్) అనే హీరోయిన్ ప్రేమిస్తుంది. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అశోక్‌కు అన్ని వేళల సహాయం చేసే కరుణాకర్ అశోక్‌ను చంపాలనుకుంటాడు. దానికి అసలు కారణం ఏంటి..? అశోక్ రాజకీయాల్లోకి వెళ్లాడా..? తనను చంపాలనుకునే వారిపై పగ తీర్చుకున్నాడా..? తన తండ్రిని ఎవరు చంపారో.. అశోక్ తెలుసుకుంటాడా..? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే!
విశ్లేషణ: కథను నమ్ముకొని సినిమాలు చేసే హీరోల్లో విజయ్ ఆంటోనీ ఒకరు. ఒక్కోసారి ఎగ్జిక్యూషన్ కారణంగా సినిమా ఆడకపోయినా.. కథలో మాత్రం కచ్చితంగా కొత్తదనం ఉంటుంది. అయితే, ఈసారి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఓ కమర్షియల్ సబ్జెక్ట్‌ను ఎన్నుకున్నాడు విజయ్ ఆంటోని. ఇప్పటివరకు రాజకీయ నేపధ్యంలో చాలా కథలు వచ్చినప్పటికీ 'యమన్' మాత్రం దానికి పూర్తి భిన్నం. ప్రతీ సన్నివేశం ఎంగేజింగ్‌గా, నెక్స్ట్ ఏం జరుగబోతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది.
ఇటువంటి సినిమాల్లో కామెడీను ఎక్కువ శాతం ఆశించలేం. కథను పక్కదారి మళ్లించకుండా డైరెక్టర్ సీరియస్‌గా స్క్రీన్‌ప్లే నడిపించాడు. పాటలు కూడా కథలో భాగంగా ఉన్నాయి. సినిమా మొదటి భాగం థ్రిల్లింగా సాగింది. సెకండ్ హాఫ్‌లో కాస్త ల్యాగ్ ఉన్నప్పటికీ అప్పటికే ఆడియన్ కథకు కనెక్ట్ అయిపోతారు కాబట్టి ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. విజయ్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. మొదటి భాగంలో సాధారణ యువకుడిగా కనిపించిన అతడు రెండో భాగంలో పక్కా రాజకీయ నాయకుడిగా కనిపించి మెప్పించాడు. త్యాగరాజన్ తన పాత్రలో ఇమిడిపోయారు. మియా జార్జ్ తన రియల్ లైఫ్ క్యారెక్టర్‌తోనే సినిమాలోనూ కనిపించింది.
చార్లే ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. ప్రింజ్ నితిక్, స్వామినాథన్, మరిముత్తు ఇలా ప్రతీ ఒక్కరూ తమ పాత్రల పరిధుల్లో బాగా నటించారు. కథను మాత్రమే నమ్ముకొని తక్కువ బడ్జెట్‌లో సినిమాను తీయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ప్రతీ సీన్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించడంతో అతని ప్రతిభ కనిపిస్తుంది. ఈ సినిమాలో విజయ్ హీరోగా నటించడంతో పాటు మంచి మ్యూజిక్ కూడా అందించాడు. ముఖ్యంగా నేపధ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది.
సినిమాటోగ్రఫీ సింపుల్‌గా ఉంది. డ్యూయెట్ సాంగ్‌లో చూపించిన లొకేషన్స్ బావున్నాయి. నిర్మాణ విలువలు బావున్నాయి. గ్రాండ్ లుక్స్ కోసం ఆర్భాటానికి పోకుండా తను రాసుకున్న కథను నిజాయితీగా ప్రేక్షకులకు అందించి దర్శకుడిగా ఓ హిట్టు సినిమా తన ఖాతాలో వేసుకున్నాడు జీవశంకర్. యాక్షన్, మైండ్ గేమ్ సినిమాలు ఇష్టపడే ఆడియెన్స్‌కు ఈ సినిమా బాగా నచ్చుతుంది.
రేటింగ్: 3.5/5
![]() |
![]() |