ఆస్ట్రేలియా టీమ్‌లో ఉసేన్ బోల్ట్!

  Written by : Suryaa Desk Updated: Mon, Nov 20, 2017, 01:52 PM
 

ఉసేన్ బోల్ట్ ఏంటి? ఆస్ట్రేలియా టీమ్‌లో ఉండటం ఏంటి అనుకుంటున్నారా? అదంతే.. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ కోసం స్ప్రింట్ కింగ్ ఉసేన్ బోల్ట్‌ను కూడా తమ సపోర్ట్ టీమ్‌లో మెంబర్‌ను చేసేసింది ఆస్ట్రేలియా. ఈ పరుగుల చిరుత సహాయంతో వికెట్ల మధ్య తమ క్రికెటర్ల పరుగు వేగం పెంచాలన్నది ఆస్ట్రేలియా టీమ్ లక్ష్యం. 100, 200 మీటర్ల వరల్డ్ రికార్డు సృష్టించిన బోల్ట్.. 8 సార్లు ఒలింపిక్ చాంపియన్ అయిన విషయం కూడా తెలిసిందే. దీంతో క్రికెటర్లు వేగంగా పరుగెత్తాలంటే ఏం చేయాలన్నదానిపై విలువైన సూచనలు అతని నుంచి తీసుకోనున్నారు. ఇప్పటికే ఈ జమైకా చిరుత క్రికెటర్లలో ఉండే ప్రధాన లోపాన్ని చెప్పేశాడు. పరుగు అందుకునే సమయంలో క్రికెటర్లు నెమ్మదిగా ఉంటారని, అక్కడే అసలు సమస్య ఉందని బోల్ట్ చెప్పాడు. ఈ ఒక్క సమస్యను అధిగమిస్తే క్రికెటర్లు కూడా వేగంగా పరుగెత్తగలుగుతారని అతనన్నాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు ఎలా పరుగెత్తాలన్నదానిపై తాను క్రికెటర్లలో అవగాహన పెంచుతున్నట్లు బోల్ట్ తెలిపాడు. 


ఈ ఏడాది ఆగస్ట్‌లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌తో తన కెరీర్‌కు బోల్ట్ గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. దీంతో అతని సేవలను ఇలా వాడుకోవాలని క్రికెట్ ఆస్ట్రేలియా ప్లాన్ వేసింది. బోల్ట్ సూచనలు కచ్చితంగా తమకు పనికొస్తాయని ఆసీస్ బ్యాట్స్‌మన్ పీటర్ హ్యాండ్స్‌కాంబ్ అన్నాడు. తొలి రెండు అడులే కీలకమని, అవి సరిగ్గా వేయగలిగితే పరుగెత్తే వేగాన్ని పెంచుకోవచ్చని బోల్ట్ చెప్పినట్లు హ్యాండ్స్‌కాంబ్ తెలిపాడు. అతని సూచనలు తాము కచ్చితంగా పాటిస్తున్నామని చెప్పాడు. రిటైరైన తర్వాత ఇప్పటికే బోల్ట్ ఓ ఫుట్‌బాల్ టీమ్‌కు రన్నింగ్‌లో శిక్షణ ఇస్తున్నాడు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అయిన గాయం నుంచి ఈ మధ్యే కోలుకున్న బోల్ట్.. ఇక తన ట్రైనింగ్ కెరీర్‌ను మొదలుపెట్టానున్నాడు. మరి బోల్ట్ సలహాలు, సూచనలు ఆసీస్ టీమ్‌కు యాషెస్ సిరీస్‌లో ఎంత వరకు ఉపయోగపడతాయో చూడాలి.