ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులు అన్ని భాషలూ నేర్చుకోవాలి : వెంకయ్యనాయుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 06, 2017, 01:04 PM

మనిషి జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమైందని, కష్టపడి చదివి మంచి జీవితానికి బాటలు వేసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కేవలం మార్కుల కోసం కాకుండా, వ్యక్తితంలో మార్పు కోసం చదవాలని వెంకయ్య సలహా ఇచ్చారు. రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య యూనివర్శిటీలో ఎన్టీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి అనేక ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. విద్యార్థులు అన్ని భాషలూ నేర్చుకోవాలని, అయితే మాతృభాషను మాత్రం మరిచిపోవద్దని అన్నారు. కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను ఎన్నటికీ మరువరాదని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే యువతకు కేంద్రం రుణాలిస్తోందని, వాటిని వినియోగించుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాలు రాష్ట్రానికే తలమానికమని అన్నారు. 800 మంది కూర్చునే విధంగా ఎన్టీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. యూనివర్శిటీలో విద్యార్థుల ఉత్సాహం చూస్తుంటే తనకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయన్నారు. తాను ఎస్వీ యూనివర్శిటీలో, ఆంధ్రా యూనివర్శిటీలో వెంకయ్యనాయుడు చదువుకునే రోజుల్లో చాలా ఉత్సాహంగా ఉండేవాళ్లమని బాబు గుర్తుచేసుకున్నారు.అత్యధిక మంది యువత దేశం మనది... భవిష్యత్తులో ప్రపంచ సాంకేతిక విప్లవానికి నాయకత్వం వహించేది మనమే... ప్రముఖ సంస్థలు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌కు భారతీయులే సీఈవోలుగా ఉన్నారని బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ప్రతిభకు మారుపేరు... విద్యార్థులను ఉత్సాహపరిచేందుకే ప్రభుత్వం ప్రతిభా అవార్డులు అందజేస్తుందని తెలియజేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రాభివృద్ధి ఎంతగానో సహకరించారని, ఆయన ఇప్పుడు రాజకీయాలు చేయలేకపోవచ్చు గానీ.. రాష్ట్రానికి అండగా మాత్రం ఉంటారని అన్నారు. ఓ సాధారణ వ్యక్తి పట్టుదల, అకుంఠిత దీక్షతో భారతదేశ రెండో అత్యున్నత పదవిని అధిష్టించడం తెలుగువారికే గర్వకారణం’ అని చంద్రబాబు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కూడా పాల్గొన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com